CM Chandrababu: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు!
స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవడంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను అందించనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించిన వారిని ఇందులో గుర్తించారు.
- By Gopichand Published Date - 09:28 PM, Sun - 5 October 25

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పరిశుభ్రత ప్రమాణాలు పాటించిన మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఇతర సంస్థలు, వ్యక్తులకు రేపు (అక్టోబర్ 6, ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) చేతుల మీదుగా ‘స్వచ్ఛతా అవార్డులు’ ప్రదానం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ప్రతిష్ఠాత్మక స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం నిర్వహించబడుతుంది.
21 కేటగిరీల్లో రాష్ట్రస్థాయి అవార్డులు
స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవడంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను అందించనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించిన వారిని ఇందులో గుర్తించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొత్తం 21 కేటగిరీల్లో 69 రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేయనున్నారు. అదనంగా జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు విజేతలకు అందజేయనున్నారు.
Also Read: Bathukamma Kunta: బతుకమ్మ కుంటలో ఆపరేషన్ క్లీనింగ్ చేపట్టిన హైడ్రా!
అవార్డులు అందించే ప్రధాన కేటగిరీలు
- స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు
- స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు
- స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు
ఎంపికైన ఉత్తమ మున్సిపాలిటీలు, పంచాయతీలు
రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతకు పెద్దపీట వేసిన ఆరు మున్సిపాలిటీలు, ఆరు గ్రామ పంచాయతీలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నాయి.
మున్సిపాలిటీలు: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం.
గ్రామ పంచాయతీలు: అనకాపల్లి జిల్లాలోని చౌడువాడ, ప్రకాశం జిల్లాలోని ఆర్ఎల్ పురం, కోనసీమలోని లోల్ల, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కడప జిల్లాలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని కనమకులపల్లె.
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
స్వచ్ఛతకు కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అవార్డులు అందించి సత్కరించనున్నారు. ఈ అవార్డుల ప్రదానం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత పట్ల ప్రజల్లో, ప్రభుత్వ విభాగాల్లో మరింత ప్రేరణ నింపుతుందని అధికారులు తెలిపారు.