Bathukamma Kunta: బతుకమ్మ కుంటలో ఆపరేషన్ క్లీనింగ్ చేపట్టిన హైడ్రా!
ప్రాంతం రూపురేఖలు మారడంతో ఇంటింటికీ తిరిగి చెత్త కలెక్షన్ చేసిన ఆటోలను గతంలో మాదిరిగానే కుంట ప్రధాన ద్వారం వద్ద పార్క్ చేయడం సందర్శకులకు ఇబ్బందిగా మారింది.
- By Gopichand Published Date - 08:45 PM, Sun - 5 October 25

Bathukamma Kunta: దసరా పండుగ వేడుకలు, బతుకమ్మ సంబురాలు ముగిసిన వెంటనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) అధికారులు బతుకమ్మ కుంట (Bathukamma Kunta) వద్ద “ఆపరేషన్ క్లీనింగ్” కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఆదివారం ప్రారంభించిన ఈ బతుకమ్మ కుంట చెంత వరుసగా మూడు రోజులు (ఆదివారం నుంచి మంగళవారం వరకు) పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటలు ఆడారు.
పూల వ్యర్థాల తొలగింపు
బతుకమ్మ ఆటల అనంతరం కుంటలో భారీ మొత్తంలో పూల వ్యర్థాలు, బతుకమ్మలను పేర్చిన ట్రేలు పేరుకుపోయాయి. దీంతో హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో DRF (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), MET సిబ్బంది రంగంలోకి దిగారు. వీరు కుంటలో మునిగిపోయిన, కుళ్లిపోతున్న పూల వ్యర్థాలను, ప్లాస్టిక్ ట్రేలను బయటకు తీశారు. “ఆపరేషన్ బతుకమ్మ కుంట” క్లీనింగ్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల కుంట ప్రాంతం శుభ్రంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది.
Also Read: YS Sharmila: ఆటో డ్రైవర్లను మోసగించడంలో దొందు దొందే: వైఎస్ షర్మిల
ఆక్రమణల నుంచి పర్యాటక కేంద్రంగా
గతంలో ఈ బతుకమ్మ కుంట ప్రాంతం అక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలు, కబ్జాదారుల చెరలో ఉండేది. ఆ సమయంలో GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)కు చెందిన చెత్త కలెక్షన్ ఆటోలను ఇక్కడ పార్క్ చేసేవారు. అయితే ‘హైడ్రా’ జోక్యంతో ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి, ఇప్పుడు పిక్నిక్ స్పాట్‌లా మారింది.
ఆటోలకు ప్రత్యామ్నాయ పార్కింగ్
ప్రాంతం రూపురేఖలు మారడంతో ఇంటింటికీ తిరిగి చెత్త కలెక్షన్ చేసిన ఆటోలను గతంలో మాదిరిగానే కుంట ప్రధాన ద్వారం వద్ద పార్క్ చేయడం సందర్శకులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గుర్తించిన ‘హైడ్రా’ అధికారులు, వాహనదారులు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఆటోల పార్కింగ్‌కు ప్రత్యామ్నాయ సౌకర్యాన్ని కల్పించారు. బతుకమ్మ కుంటకు దగ్గరలోనే ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఆటోల పార్కింగ్ సౌకర్యాన్ని ‘హైడ్రా’ కల్పించింది. దీంతో బతుకమ్మ కుంట ప్రధాన ద్వారం వద్ద రద్దీ తగ్గి, ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ‘హైడ్రా’ తీసుకున్న ఈ చర్యలను స్థానికులు, సందర్శకులు స్వాగతిస్తున్నారు.