CM Chandrababu: భారీ సెక్యూరిటీ, బందోబస్తు హడావుడికి దూరంగా సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మితిమిరిన భద్రతతో అనేక విమర్శల పాలయ్యారు. జగన్ నాడు తన భద్రత కోసం మొత్తం 980 మంది భద్రతా సిబ్బందిని నియమించున్నారు.
- By Gopichand Published Date - 12:24 PM, Sun - 22 December 24

CM Chandrababu: సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది తమ విధానమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారం చేపట్టిన నాటినుంచి చెపుతున్నారు. దీన్ని ఆచరణలో పెట్టేందుకు ఆయన అనుక్షణం ప్రయత్నం చేస్తున్నారు. హంగులు, ఆర్భాటాలు, బందోబస్తు పేరుతో హడావుడి వంటి చర్యలకు దూరంగా తన పర్యటనలు సాగేలా చూస్తున్నారు. తన కోసం ఎక్కువ సమయం ట్రాఫిక్ నిలిపివేయవద్దని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సూచించిన చంద్రబాబు దాని అమలు సైతం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఆగినట్లు కనిపిస్తే…దానిపైనా అధికారులతో ఆరా తీస్తున్నారు. ఇక జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో కూడా ఇదే విధానం పాటించాలని సిఎం అధికారులకు ఆదేశించారు. అయితే పలు జిల్లాల్లో ఇప్పటికీ కొందరు అధికారుల్లో పాత వాసనలు పోకపోవడంపై సీఎం ఒకటి రెండు సార్లు గట్టిగానే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలవరం పర్యటనలో పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించడంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సిఎం స్పష్టమైన సూచనలు చేశారు. ఇంత భారీ బందోబస్తు అవసరం లేదని…డ్రోన్లు ఆపరేట్ చేయడం ద్వారా భద్రతను పర్యవేక్షించాలని సూచించారు. తన పర్యటనల్లో ఇతర జిల్లాల నుంచి వందల మంది పోలీసులను తెచ్చి రోడ్లపై రోజంతా ఉంచే సంస్కృతి ఉండకూడదనేది సిఎం ఆలోచనగా ఉంది. భద్రతా పరంగా పోలీసులు అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావిచే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో తప్ప…ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్నమేరకే పోలీసులను పెట్టాలని సిఎం సూచించారు.
నాడు 980 మంది…నేడు 121 మందితో భద్రత
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మితిమిరిన భద్రతతో అనేక విమర్శల పాలయ్యారు. జగన్ నాడు తన భద్రత కోసం మొత్తం 980 మంది భద్రతా సిబ్బందిని నియమించున్నారు. తాడేపల్లి ఇంటి చుట్టూ చెక్ పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ఆర్మడ్ గాడ్స్, పబ్లిక్ రోడ్లలో జనాలను తిరగకుండా ఆంక్షలతో సిఎం నివాస చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తి నిషేధిత ప్రాంతంగా చేశారు. ప్రత్యేక ఆపరేషన్లుకు ఉపయోగించే అక్టోపస్ టీం ఫోర్స్‌ను ఇంటి చుట్టుపక్కల 24 గంటలు సెక్యూరిటీలో ఉపయోగించారు. ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఇంటికి నాలుగు మూలల నలుగురు స్నైపర్స్‌ను కూడా జగన్ భద్రత కోసం మోహరించారు. బుల్లెట్ ఫ్రూప్ వాహనాలతో మొబైల్ క్యూఆర్టీలు ఏర్పాటు చేసి దేశంలో ఏ ఇతర సిఎంకు లేని స్థాయిలో నాడు సెక్యూరిటీ కోసం కోట్లు ఖర్చు చేశారు. జగన్ భద్రత కోసం నెలకు రూ.7.50 కోట్లు, యేడాదికి రూ.90 కోట్లు చొప్పున ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారు.
Also Read: Students Threat Emails : ఆ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపింది విద్యార్థులే!
5 వంతుతో పటిష్టమైన భద్రత
అయితే నేటి సిఎం చంద్రబాబుకు నాటి సిబ్బందిలో 5వ వంతుతోనే భద్రత కల్పిస్తున్నారు. ఉండవల్లి సీఎం నివాసం వద్ద అన్ని విభాగాలు కలిపి 121 మంది మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అంటే నాటి సీఎం నివాసం వద్ద వందల మందిని మోహరించగా…నేడు అందులో ఐదో వంతు మందితోనే పోలీసులు పటిష్ట భద్రత అందిస్తున్నారు. జగన్ కాన్వాయ్ కాన్వాయ్ లో 17 వాహనాలు ఉండగా….జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ 11 వాహనాలతోనే ఉంటోంది. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా అవసరమైన కనీస సిబ్బందితో ఆయన భద్రత కొనసాగుతుంది. ఒక విఐపిగా, జెడ్ ప్లస్ క్యాటగిరీలో ఎన్ఎస్‌జి భద్రతలో ఉండే చంద్రబాబుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే వినియోగిస్తున్నామని…..అనవసర హడావుడి, అధిక మొత్తంలో భద్రతా సిబ్బంది, ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి వాటికి దూరంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. తన పర్యటనల సందర్భంగా ప్రజలకు అసౌకర్యం రాకూడదన్న సిఎం సూచనలను అధికారులు మరింత పూర్తిగా అన్ని చోట్లా అమలుచేయనున్నారు.
ఉండవల్లి నివాసంలో అటానమస్ డ్రోన్
ఎక్కువ మంది పోలీసులు, సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని…తక్కువ మందితో, టెక్నాలజీ సాయంతో, ప్రణాళికతో వ్యవహరించినా మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చు అనేది అధికారుల మాట. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్‌ను ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒక సారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా మూమెంట్ కనిపించినా, కొత్త వస్తువులు, అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీంకు మెసేజ్ పంపుతుంది. సిఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటనామస్ విధానంలో ఆటోపైలెట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్లీ వచ్చి నిర్దేశించిన డక్ పై ల్యాండ్ అయ్యి తానే చార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపే డాటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అటానమస్ డ్రోన్ ద్వారా తక్కువ సమయం, సిబ్బందితో ఎక్కువ పని జరుగుతుంది. నాణ్యతా పెరుగుతుంది. మరోవైపు ప్రైవేటు కార్యక్రమాలకు సిఎం వెళుతున్న సందర్భంలో అక్కడి వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సిబ్బందిని పెట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు, కార్యక్రమాలకు తాను వెళుతున్నప్పుడు…..అనవసర ఆంక్షలుపెడితే ఆ కార్యక్రమాలకు వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుందని….ఇలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావుడి తగ్గించాలని సిఎం గట్టిగా సూచించారు. ఇలా ప్రతి విషయంలో ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో చాలా వరకు సిఎం పర్యటన సందర్భంగా ఆంక్షల సమస్య తలెత్తడం లేదు.వీటిని మరింత సరళీకృతం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.