అమెరికా ట్రెజరీ సెక్రటరీ కీలక ప్రకటన.. భారత్‌పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం..?
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2026 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
Russia Sanctions Bill: సుంకాలు విధించడంపై సెనెట్ అవసరం లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఏ అనుమతి అవసరం లేదన్నారు. అయితే, ఈసారి సుంకాల బెదిరింపు ప్రధాన లక్ష్యం భారత్ కాదు, చైనా అని ఆయన స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 25 శాతం సుంకాలు విధించిన తర్వాత రష్యా చమురును కొనడం మానేసిందని స్కాట్ బేసెంట్ పేర్కొన్నారు. అమెరికా కఠినమైన వాణిజ్య విధానాల కారణంగా భారత్ తన దిగుమతుల్లో మార్పులు చేసిందని అన్నారు.
500% సుంకాల బిల్లు అంటే ఏమిటి?
స్కాట్ బేసెంట్ ప్రస్తావించిన బిల్లు రష్యా ఆంక్షల బిల్లు. కాగా, దీని ప్రకారం రష్యా నుండి చమురును కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కనీసం 500 శాతం సుంకాలు విధించవచ్చు. ఈ బిల్లును ఈ నెల ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం పొందారు.
స్కాట్ బేసెంట్ ఈ విషయం చెప్పారు
ఒక ఇంటర్వ్యూలో బేసెంట్ మాట్లాడుతూ.. రష్యా చమురును కొనుగోలు చేసే వారిపై 500% సుంకాలు విధించే ప్రతిపాదనను సెనేటర్ లిండ్సే గ్రాహం సెనేట్ ముందు ఉంచారు. ఇది ఆమోదం పొందుతుందో లేదో తరువాత సంగతి. అయితే, దీని కోసం అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎలాంటి అనుమతి అవసరం లేదని నేను నమ్ముతున్నాము. అమెరికా దీనిని IEPA (International Emergency Powers Act) కింద అమలు చేయవచ్చు, కాని సెనేట్ వారికి ఈ అధికారాన్ని చట్టపరంగా ఇవ్వాలనుకుంటుంది’ అన్నారు.
యూరప్‌ను టార్గెట్ చేసిన అమెరికా
వైట్ హౌస్ సీనియర్ అధికారి యూరప్ దేశాలను కూడా విమర్శించారు. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా యూరప్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని, తద్వారా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అన్నారు. ఈ సందర్భంగా స్కాట్ బేసెంట్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురును కొనడం ప్రారంభించిందని, అయితే అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన తర్వాత భారత్ కొంతమేర కొనుగోలు తగ్గించిందని, ఇప్పుడు పూర్తిగా నిలిపివేసిందని పేర్కొన్నారు.
చైనాపై గురి
స్కాట్ బేసెంట్ ఇంకా మాట్లాడుతూ.. రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారు చైనా అని, అమెరికా చాలా కాలంనుంచి చైనాపై 500 శాతం వరకు సుంకాలు విధించాలని యోచిస్తోందని తెలిపారు. ఎందుకంటే రష్యా నుండి చైనా చౌకగా చమురు కొనుగోలు చేసి యుద్ధానికి ఆర్థిక సహాయం చేస్తోందని అన్నారు.
500% సుంకాల బిల్లుపై భారతదేశం వైఖరి
అమెరికా విధిస్తున్న ఈ రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ కూడా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ‘ప్రతిపాదిత బిల్లు గురించి మాకు పూర్తిగా అవగాహనా ఉంది. దీనికి సంబంధించిన అన్ని పరిణామాలను మేం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’ అన్నారు. అమెరికా తీసుకునే నిర్ణయాల తరువాత భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తుందన్నారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదన్నారు.