Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!
అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా థాయిలాండ్- కంబోడియా నాయకులు విస్తరించిన కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా థాయిలాండ్ ప్రధానమంత్రి, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో వ్యక్తిగత నిబద్ధత చూపినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు.
- By Gopichand Published Date - 07:15 PM, Sun - 26 October 25
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ఆదివారం థాయిలాండ్, కంబోడియా దేశాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ సమక్షంలో ఇరు దేశాల నాయకులు కాల్పుల విరమణ ఒప్పందంపై చారిత్రక సంతకాలు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌కు విదేశాలలో ఇది అత్యంత సుదీర్ఘ పర్యటన.. ఆసియాలో మొదటి పర్యటన. ఈ పర్యటనలో ఆయన కౌలాలంపూర్‌లో ప్రారంభం కానున్న ఆసియాన్ (ASEAN) సదస్సులో పాల్గొంటారు.
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణను త్వరలో పరిష్కరిస్తాం
థాయిలాండ్, కంబోడియా నాయకులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో విస్తరించిన కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్.. తమ పరిపాలన గత 8 నెలల్లో 8 యుద్ధాలను ముగించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న ఘర్షణను కూడా త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన అన్నారు. తమ పరిపాలన కేవలం ఎనిమిది నెలల్లోనే ముగించిన ఎనిమిది యుద్ధాలలో ఇదొకటి అని, అంటే సగటున ప్రతి నెలా ఒక యుద్ధం ముగిసిందని ఆయన వివరించారు. ఇప్పుడు కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాజాగా మొదలైన ఘర్షణ మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ తెలిపారు. “నాకు ఇద్దరూ తెలుసు. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్, ప్రధాన మంత్రి ఇద్దరూ చాలా మంచి వ్యక్తులు. దీన్ని కూడా నేను త్వరలోనే పరిష్కరిస్తానని నాకు నమ్మకం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పనిని ఐక్యరాజ్యసమితి (UN) చేయాల్సి ఉన్నా తానే చొరవ తీసుకుంటానని చెప్పారు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!
థాయిలాండ్ ప్రధాన మంత్రి ధన్యవాదాలు
అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా థాయిలాండ్- కంబోడియా నాయకులు విస్తరించిన కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా థాయిలాండ్ ప్రధానమంత్రి, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో వ్యక్తిగత నిబద్ధత చూపినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆయుధాలను తొలగించడం, యుద్ధ ఖైదీలను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రకటన పూర్తిగా అమలు అయితే శాశ్వత శాంతికి పునాదులు పడుతాయని పేర్కొన్నారు. మలేషియా తర్వాత ట్రంప్ జపాన్, దక్షిణ కొరియాలోని బుసాన్ కూడా పర్యటిస్తారు.