Mark Zuckerberg : చైనా చేతిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. సంచలన ఆరోపణలు
ఈవిషయాన్ని అమెరికా(Mark Zuckerberg) ప్రజల నుంచి మెటా యాజమాని మార్క్ జుకర్ బర్గ్ దాస్తున్నారు.
- By Pasha Published Date - 12:06 PM, Sat - 12 April 25

Mark Zuckerberg : ఫేస్‌బుక్ (మెటా).. అమెరికా కంపెనీ. దీని పరిధిలోనే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉంటాయి. ఇది అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయదు. పనిచేయలేదు. అయితే తాజాగా ఫేస్‌బుక్ (మెటా) మాజీ సీనియర్ ఉద్యోగి సారా వైన్ విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె 2011 నుంచి 2017 వరకు మెటాలో గ్లోబల్ పాలసీ డైరెక్టర్ హోదాలో పనిచేశారు. ఆ సమయంలో తాను ఫేస్‌బుక్‌లో గుర్తించిన కీలక విషయాలను తాజాగా సారా విలియమ్స్ బయటపెట్టారు. అవి సంచలనాన్ని క్రియేట్ చేశాయి. ఎందుకంటే.. చైనాతో మెటాకు లింకు పెట్టేలా ఆ ఆరోపణలు ఉన్నాయి. చైనాతో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య యుద్ధం చేస్తున్న ప్రస్తుత తరుణంలో వచ్చిన ఈ ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తప్పకుండా వీటిపై ట్రంప్ స్పందిస్తారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read :Mivi AI : మేడిన్ హైదరాబాద్ ‘మివి ఏఐ’.. మనిషిలా ఆలోచించి సంభాషిస్తుంది
చైనా ప్రభుత్వంతో టచ్‌లో ఫేస్‌బుక్
‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ విషయంలో చైనా ప్రభుత్వంతో మెటా (ఫేస్ బుక్) కలిసి పనిచేస్తోంది. కంటెంట్ సెన్సార్ షిప్ విషయంలోనూ చైనా కనుసన్నల్లోనే మెటా పనిచేస్తోంది. ఈవిషయాన్ని అమెరికా(Mark Zuckerberg) ప్రజల నుంచి మెటా యాజమాని మార్క్ జుకర్ బర్గ్ దాస్తున్నారు. ఫేస్‌బుక్‌లోని ఉన్నతస్థాయి అధికారులతో కూడిన టీమ్ పలుమార్లు చైనా ప్రభుత్వ అధికారులతో భేటీ అయింది. అమెరికా టెక్ కంపెనీలతో చైనా కంపెనీలు పోటీ పడేందుకు అవసరమైన టిప్స్‌ను ఫేస్‌బుక్ అధికారుల టీమ్ చైనా అధికారులకు అందించింది. చైనా ప్రభుత్వానికి అనుకూలమైన ప్రోడక్ట్స్‌ను తీసుకొచ్చేందుకు కూడా ఫేస్‌బుక్ ఉన్నతాధికారుల టీమ్ అంగీకారం తెలిపింది’’ అని సారా వైన్ విలియమ్స్ ఆరోపించారు. ‘‘ మెటా ఏఐ మోడల్ లామా నుంచి చైనాకు చెందినన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్‌కు సాయం అందుతోంది. ఇవన్నీ మాట్లాడుతున్నందుకు నాపై 50వేల డాలర్ల జరిమానా వేశారు’’ అని ఆమె తెలిపారు.
అమెరికా దేశభక్తుడు.. చైనాలో రూ.1.54 లక్షల కోట్ల వ్యాపారం
‘‘ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటారు. తాను చైనాలో బిజినెస్ చేయడం లేదని అంటారు. వాస్తవం ఏమిటంటే గత దశాబ్ద కాలంలో ఆయన చైనాలో దాదాపు రూ.1.54 లక్షల కోట్ల వ్యాపారాన్ని చేశారు’’ అని సారా విలియమ్స్ ఆరోపణ చేశారు. ‘‘మార్క్ జుకర్ బర్గ్ చైనాలో తన వ్యాపార ఉనికిని పెంచుకునేందుకే కమ్యూనిస్ట్ పార్టీతో బంధాన్ని బలపర్చుకుంటున్నారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి ఇస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు.
మెటా స్పందన ఇదీ..
సారా ఆరోపణలను మెటా ఖండించింది. ఆమెకు విధించిన జరిమానా కాంగ్రెస్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినందుకు కాదని, ఉద్యోగం వీడేందుకు ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించినందుకే అని స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటివరకు మెటా ఎలాంటి సేవలు అందించడం లేదని మెటా అధికార ప్రతినిధి ర్యాన్ డేనియల్ తెలిపారు.