Abid Hasan Safrani : భారతావనికి ‘జైహింద్’ ఇచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ
ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో ఆబిద్ (Abid Hasan Safrani) చదువుకున్నారు.
- By Pasha Published Date - 10:55 AM, Sat - 12 April 25

Abid Hasan Safrani : ‘జైహింద్’ నినాదం ప్రతీ భారతీయుడికి సుపరిచితం. ఈ నినాదం ఇచ్చిన దేశ భక్తుడి పేరు మాత్రం చాలామందికి తెలియదు. ఆయనే.. ఆబిద్ హసన్ సఫ్రానీ. ఆబిద్ తొలిసారిగా జైహింద్ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే దీన్ని పదేపదే ప్రసంగాల్లో వినియోగించి పాపులారిటీ తెచ్చిన ఘనత మాత్రం ఆబిద్ ఆప్త మిత్రుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కే దక్కుతుంది. ఆబిద్ హసన్ సఫ్రానీ తెలంగాణ ముద్దుబిడ్డ. ఈయన జీవిత విశేషాలను, నేతాజీతో ఉన్న అనుబంధం వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Warangal Textile Park: వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో 25వేల జాబ్స్.. అప్లై చేసుకోండి
ఆబిద్ హసన్ సఫ్రానీ గురించి..
- ఆబిద్ హసన్ సఫ్రానీ 1911 ఏప్రిల్ 11న హైదరాబాద్ నగరంలో జన్మించారు.
- ఈయన అసలు పేరు జైనుల్ ఆబిదీన్ హసన్.
- ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో ఆబిద్ (Abid Hasan Safrani) చదువుకున్నారు.
- ఆబిద్ తల్లి ఫఖ్రుల్ హాజియా బేగం నిజాం నవాబును ఎదిరించి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈమె సరోజినీనాయుడుకు స్నేహితురాలు.
- ఆబిద్ హసన్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. అయితే బ్రిటీష్ వారిపై వ్యతిరేకతతో తల్లి ఫఖ్రుల్ హాజియా అందుకు నో చెప్పారు. దీంతో ఆయన ఫారిన్‌కు వెళ్లలేదు.
- ఆబిద్ ఆ తర్వాత ఇంజినీరింగ్ విద్య కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడే నేతాజీ సుభాస్ చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది.
- దీంతో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే విడిచిపెట్టి, నేతాజీకి వ్యక్తిగత కార్యదర్శిగా, జర్మన్ భాష అనువాదకుడిగా ఆయన చేరారు.
- నేతాజీ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆబిద్ మేజర్‌గా పనిచేశారు.
- నేతాజీకి తోడుగా ఉండి భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
- బ్రిటన్‌తో జర్మనీ యుద్ధం చేస్తున్న సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఉండేవారు. వారు ‘నమస్కార్’ , ‘రామ్ రామ్’, ‘సత్ శ్రీ అకాల్’, ‘అస్సలాము అలైకుం’ అంటూ తీరొక్క రకమైన అభివాదాలు చేసుకోవడం నేతాజీకి నచ్చలేదు. దీంతో అందరికీ ఆమోదయోగ్యమైన ఓ అభివాద నినాదాన్ని రూపొందించాలని సన్నిహితులకు సూచించారు.
- నేతాజీ ఎదుట ఆబిద్ హసన్.. ముందుగా ‘హలో’ అని ప్రతిపాదించారు. అది బోస్‌కు నచ్చలేదు. ఆ తర్వాత.. ‘జై హిందుస్తాన్’, ‘జై హింద్’ అని ప్రతిపాదించారు. ‘జై హింద్’ నినాదం బాగుందని నేతాజీ చెప్పారు.
- చివరగా సింగపూర్ జైలులో ఆబిద్ ఉన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఆయనను ఆ జైలు నుంచి విడుదల చేశారు.
- ఆబిద్ భారత్‌కు తిరిగి వచ్చాక.. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను కలిశారు. నెహ్రూ ఆయనకు నేరుగా ఇండియన్ ఫారిన్ సర్వీసు (ఐఎఫ్ఎస్)లో అవకాశం కల్పించారు.
- ఈజిప్టు, చైనా, స్విట్జర్లాండ్, ఇరాక్, సిరియా, సెనెగల్, డెన్మార్క్ వంటి దేశాల్లో భారత రాయబారిగా ఆబిద్ సేవలు అందించారు.
- రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్‌లోని షేక్ పేట్‌లో ఉన్న టోలీచౌకీ ప్రాంతంలో ఆబిద్ స్థిరపడ్డారు.
- 1984 ఏప్రిల్ 5న ఆయన కన్నుమూశారు.