ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!
సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.
- Author : Gopichand
Date : 09-01-2026 - 2:55 IST
Published By : Hashtagu Telugu Desk
India Rice Export To Iran: భారత్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 165 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ప్రపంచ బియ్యం వాణిజ్యంలో మొత్తం 45 మిలియన్ టన్నుల ఎగుమతులు జరుగుతుండగా, అందులో భారత్ వాటానే 22 మిలియన్ టన్నులు (బాస్మతీ, నాన్-బాస్మతీ కలిపి). బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు సాధారణ బియ్యాన్ని కొనుగోలు చేస్తుండగా.. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్ నుండి ప్రీమియం బాస్మతీ బియ్యాన్ని దిగుమతి చేసుకుంటాయి.
అసలు సమస్య ఏమిటి?
ఇరాన్ ప్రభుత్వం ఆహార పదార్థాల దిగుమతులపై ఇన్నాళ్లూ ఇస్తూ వచ్చిన సబ్సిడీని అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడమే ఈ చిక్కులకు ప్రధాన కారణం. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు తమ సరుకును పంపడం నిలిపివేశారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. సుమారు రూ. 2000 కోట్ల విలువైన బాస్మతీ బియ్యం కంటైనర్లు ప్రస్తుతం అంతర్జాతీయ ఓడరేవుల్లో ఇరాన్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాయి.
ఇరాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
కరెన్సీ పతనం: అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దీనివల్ల దిగుమతులపై సబ్సిడీ ఇవ్వడం ఆ దేశానికి భారంగా మారింది.
నేరుగా నగదు బదిలీ: సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది. రాబోయే 4 నెలల పాటు ప్రతి పౌరుడికి సుమారు రూ. 600 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Also Read: నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య అంటే?
ఎగుమతిదారులపై ప్రభావం
సబ్సిడీ తొలగింపు వల్ల ఎగుమతిదారులు తమ ఉత్పత్తులపై పూర్తి స్థాయిలో పన్నులు, సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయి. ముఖ్యంగా బాస్మతీ బియ్యాన్ని పండించే భారత్ లోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు, ప్రాసెస్ చేసే సంస్థలు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
భారత ఎగుమతిదారుల ఆందోళన
పంజాబ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ సింగ్ జోసన్ మాట్లాడుతూ.. “డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ పడిపోవడంతో ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీని నిలిపివేసింది. దీనివల్ల ఎగుమతిదారులు వ్యాపారం కొనసాగించడానికి భయపడుతున్నారు” అని తెలిపారు.
గతంలో ఇరాన్‌తో వాణిజ్యం ‘బార్టర్ సిస్టమ్’ (వస్తు మార్పిడి పద్ధతి- చమురుకు బదులుగా బియ్యం) ద్వారా జరిగేది. భారత్ ఇరాన్ నుండి చమురు దిగుమతులను ఆపివేసిన తర్వాత ఆ వ్యవస్థ ముగిసింది. అప్పటి నుండి బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా ఇబ్బందులు ఉన్నప్పటికీ టీ, బియ్యం, మందులు ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు వాటిపై కూడా కోత పడేలా కనిపిస్తోంది.