గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
- Author : Vamsi Chowdary Korata
Date : 12-03-2026 - 9:58 IST
Published By : Hashtagu Telugu Desk
కెంటకీ, ఒహియో పర్యటనల అనంతరం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంపై కీలక విషయాలు పంచుకున్నారు. “మేం తలచుకుంటే గంటలో వారి విద్యుత్ సామర్థ్యాన్ని కూల్చివేయగలం. దాన్ని మళ్లీ నిర్మించుకోవడానికి వారికి 25 ఏళ్లు పడుతుంది. కానీ మేం అలా చేయాలనుకోవడం లేదు” అని అన్నారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే తాము నిర్వీర్యం చేశామని, వారి నౌకాదళం, వాయుసేనలను తుడిచిపెట్టేశామని చెప్పారు.
అమెరికా చేపడుతున్న సైనిక చర్యకు ఇతర శక్తిమంతమైన దేశాల నుంచి ప్రైవేట్‌గా మద్దతు లభిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. తమ సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోని సరిహద్దు విధానాల వల్ల ఇరాన్‌కు చెందిన స్లీపర్ సెల్స్ అమెరికాలోకి ప్రవేశించాయని ట్రంప్ ఆరోపించారు. “చాలా మంది బైడెన్ తెలివి తక్కువ ఓపెన్ బార్డర్ విధానం ద్వారా లోపలికి వచ్చారు. వారిలో చాలామంది ఎక్కడున్నారో మాకు తెలుసు, వారిపై ఓ కన్నేసి ఉంచాం” అని తెలిపారు.
యుద్ధం వల్ల ఇంధన మార్కెట్లపై ప్రభావం పడకుండా, వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ వివరించారు. ఈ ప్రక్రియను చాలా వేగంగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.