Donald Trump: వచ్చే వారం కీలక ప్రకటన చేయనున్న డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో దిగబోతున్నారు.
- Author : Gopichand
Date : 09-11-2022 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో దిగబోతున్నారు. ఈ విషయంలో డోనాల్ట్ ట్రంప్ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వచ్చే వారం తాను ఓ భారీ ప్రకటన చేయబోతున్నానంటూ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ఆ ప్రకటన ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తన రంగ ప్రవేశం గురించేనన్న టాక్ అమెరికా వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల ఓహాయో రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. నవంబర్ 15న మార్ ఏ లాగో నివాసంలో నేను ఓ భారీ ప్రకటన చేయబోతున్నా అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే అక్కడ ఉన్నవారు చప్పట్లు కొట్టారు.
గత అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్ చేసిన ప్రకటన రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించేనంటూ ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 ఎన్నికలలో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయకపోతే నేను చాలా ఆశ్చర్యపోతాను అని డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు ఒకరు తెలిపారు. అంతేకాకుండా వచ్చే మంగళవారం ట్రంప్ చేసే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అని ఆయన చెప్పారు.
అమెరికాలో త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బైడెన్ మద్దతుదారుల సంఖ్య పడిపోతున్నట్లు కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. ఇక ఈ మిడ్ టర్మ్ ఎన్నికల్లో బైడెన్ పార్టీ వెనుకబడితే 2024లో జరిగే జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రెట్ల పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిడ్ టర్మ్‌లో రిపబ్లికన్లు పార్టీ ప్రభావం చూపితే డోనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ వచ్చే వారం ఏ ప్రకటన చేస్తారో అని అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.