నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Author : Vamsi Chowdary Korata
Date : 10-03-2026 - 3:28 IST
Published By : Hashtagu Telugu Desk
Donald Trump ఇరాన్ నౌకలను ముంచడం సరదాగా అనిపించిందని తమ సైన్యం చెప్పిందని, అదే సురక్షితమని కూడా వారు తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వారు చెప్పింది తనకు నిజమే అనిపించిందని అన్నారు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం అనంతరం ఇప్పటి వరకు 5 వేల లక్ష్యాలను ఛేదించామని ఆయన వెల్లడించారు. తమ దాడులతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం 10 శాతానికి పడిపోయిందని అన్నారు.
మూడున్నర రోజుల్లో ఇరాన్‌కు చెందిన 46 అగ్రశ్రేణి నౌకలను అమెరికా మిలిటరీ ముంచివేసిందని అన్నారు. ఇరాన్ డ్రోన్, క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమవుతోందని అన్నారు. 46 ఇరాన్ నౌకలను ముంచివేశామంటే విశ్వసించగలరా అని అన్నారు. అయితే ఒక విషయంలో మన సైన్యం తీరు తొలుత తనకు నచ్చలేదని, దాంతో వెంటనే సైనికాధికారులతో మాట్లాడానని అన్నారు.
ధ్వంసమైన నౌకలు ఎలాంటివని తాను అడిగానని, అవి ఇరాన్ అగ్రశ్రేణి నౌకలు అని తమ సైన్యం చెప్పిందని అన్నారు. అలాంటప్పుడు వాటిని స్వాధీనం చేసుకుని మన కోసం ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు ముంచివేశారని తాను వారిని ప్రశ్నించానని తెలిపారు. వాటిని ముంచడం సరదాగా అనిపించిందని, అలా చేయడమే సురక్షితమని వారు సమాధానం చెప్పారని అన్నారు. వారి సమాధానం తనకు నిజమే అనిపించిందని అన్నారు.