Pak PM House: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు.. బంకర్‌లోకి షాబాజ్ ?
బెలూచిస్తాన్ వేర్పాటువాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారా ? అనే కోణంలో పాక్(Pak PM House) మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- By Pasha Published Date - 11:45 PM, Thu - 8 May 25

Pak PM House: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇంటికి సమీపంలో బాంబు పేలింది. ఆయన నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు జరిగిందని సమాచారం. అయితే ఈ పేలుడుకు కారణం ఏమిటి ? ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఈ పేలుడుకు పాల్పడ్డారా ? బెలూచిస్తాన్ వేర్పాటువాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారా ? అనే కోణంలో పాక్(Pak PM House) మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవం ఏమిటి అనేది తెలియాలంటే కొంత సమయం పాటు వేచి ఉండాల్సిందే. మొత్తం మీద ఈ పేలుడు తర్వాత పాక్ ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా టీమ్ అలర్ట్ అయింది. ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత పెంచారు. ఈ పేలుడు తర్వాత షాబాజ్ షరీఫ్ సీక్రెట్ బంకర్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు సమాచారం. పాక్ ప్రధాని రాకపోకలు సాగించే మార్గాల్లోనూ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి.
Also Read :India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్
యుద్ధంలో ఓటమి దిశగా పాక్..
భారత్‌పై దాడికి దిగిన మూడు పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. ఇవి ఎఫ్-16, జేఎఫ్-17 రకాలకు చెందిన యుద్ధ విమానాలు. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఎదురవుతున్న ప్రభావంతో పాక్‌లో షాబాజ్ షరీఫ్ సర్కారు కూలిపోయే అవకాశాలు లేకపోలేదు. వాస్తవానికి చివరిసారిగా పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులే మెజారిటీ సంఖ్యలో గెలిచారు. అయితే భుట్టో కుటుంబానికి చెందిన రాజకీయ పార్టీ పీపీపీ, నవాజ్ షరీఫ్‌కు చెందిన రాజకీయ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు బెలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థల దాడులతో అట్టుడుకుతోంది. ఇప్పుడు భారత్ సరిహద్దులోని పాకిస్తానీ ప్రావిన్స్‌లలో కూడా శాంతిభద్రతలు గాడితప్పే పరిస్థితులు వచ్చాయి. మొత్తంగా పాకిస్తాన్ కల్లోల వాతావరణంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.