ED Vs Lalu : త్వరలో పోల్స్.. లాలూపై ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
రైల్వేశాఖ నిర్ణయాలన్నీ నాటి కేంద్ర ప్రభుత్వానివని, వాటిలో తన వ్యక్తిగత అభిప్రాయం లేదని లాలూ(ED Vs Lalu) స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 08:11 PM, Thu - 8 May 25

ED Vs Lalu : ఈ ఏడాది అక్టోబరు – నవంబరు మధ్య కాలంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్‌లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) సారథి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి మంజూరు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత రైల్వేశాఖ మంత్రిగా లాలూ వ్యవహరించారు. ఆ టైంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంకు లాలూ, ఆయన కుటుంబీకులు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రైల్వేశాఖ నిర్ణయాలన్నీ నాటి కేంద్ర ప్రభుత్వానివని, వాటిలో తన వ్యక్తిగత అభిప్రాయం లేదని లాలూ(ED Vs Lalu) స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో లాలూను విచారించేందుకు అనుమతి కోరుతూ భారత రాష్ట్రపతికి ఈడీ దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఈడీకి ఈరోజు (గురువారం) పచ్చజెండా ఊపారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో లాలూను విచారించేందుకు అనుమతి ఇచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
Also Read :Pakistan Attack : అర్ధరాత్రి వేళ దాడికి పాక్ యత్నం.. బలంగా తిప్పికొట్టాం : భారత్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం ఏమిటి?
2004 నుంచి 2009 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ సేవలు అందించారు. ఆ టైంలో భారత రైల్వేలలో గ్రూప్ డీ సబ్‌స్టిట్యూట్ సిబ్బంది నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలను లాలూ ఎదుర్కొంటున్నారు. ఈమేరకు ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం.. రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి లంచంగా భూమిని లాలూ పుచ్చుకున్నారు. ఈవిధంగా అక్రమంగా పొందిన భూములను లాలూ యాదవ్ కుటుంబ సభ్యుల పేర్లపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రిజిస్టర్ చేయించారు. ఈ కేసులో సీబీఐ మూడు ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసింది.