సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!
తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.
- Author : Gopichand
Date : 26-12-2025 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
- అమెరికాలోని ఆశ్చర్యపోయే ఘటన
- 540 మంది ఉద్యోగులకు రూ.2,155 కోట్లు ఇచ్చిన సీఈవో
- ఉద్యోగుల కోసం లాభాల్లో వాటా
CEO: సాధారణంగా ఏదైనా కంపెనీ భారీ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఆ లాభాలు కేవలం ప్రమోటర్లకు లేదా ఇన్వెస్టర్లకు మాత్రమే అందుతాయి. కానీ అమెరికాలోని లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. లూసియానాకు చెందిన ఫైబర్‌బాండ్ అనే ఫ్యామిలీ బిజినెస్ సీఈఓ గ్రాహం వాకర్, తన కంపెనీని విక్రయించిన తర్వాత వచ్చిన లాభాల్లో తన ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసి ఆదర్శంగా నిలిచారు.
ఉద్యోగుల కోసం రూ. 2155 కోట్లు
కంపెనీ విక్రయం ద్వారా తనకు అందే మొత్తంలో 15 శాతం వాటాను తన వద్ద పనిచేస్తున్న 540 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు పంచాలని గ్రాహం నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం సుమారు 240 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2,155 కోట్లు (21 బిలియన్ల 55 కోట్లు).
Also Read: న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అతనికే!
డీల్- బోనస్ వివరాలు
ఫైబర్‌బాండ్ కంపెనీని అమెరికన్ దిగ్గజ సంస్థ Eaton కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో గ్రాహం ఒక కీలక షరతు పెట్టారు. కంపెనీ అమ్మకం ద్వారా వచ్చే లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని కోరారు. కంపెనీలో షేర్లు లేని ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తింపజేయడం విశేషం. ఈ బోనస్ చెల్లింపులు జూన్ 2025 నుండి ప్రారంభమయ్యాయి.
ఒక్కో ఉద్యోగికి ఎంత వస్తుంది?
ఈ లెక్కన సగటున ప్రతి ఉద్యోగికి సుమారు 4 లక్షల 43 వేల డాలర్లు (భారతీయ రూపాయిల్లో దాదాపు రూ. 3.7 కోట్లు) అందుతాయి. అయితే ఈ మొత్తం ఒకేసారి ఇవ్వబడదు. వచ్చే 5 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఈ నగదును అందజేస్తారు. అయితే, ఈ బోనస్ పొందాలంటే సదరు ఉద్యోగి కంపెనీలోనే కొనసాగాలనే నిబంధన ఉంది.
సీఈఓ ఏమన్నారంటే?
తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు. ఈ వార్త విన్నప్పుడు చాలా మంది ఉద్యోగులు మొదట నమ్మలేకపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్రాహం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది ఈ ఏడాది క్రిస్మస్ సీజన్‌లో అత్యంత సానుకూలమైన వార్తల్లో ఒకటిగా నిలిచింది.