Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!
ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయన్నారు.
- By Gopichand Published Date - 09:36 PM, Sat - 4 January 25

Telangana Government: రైతులకు, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ వినిపించనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాల కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగూరు ప్రాజెక్టుకి మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.
కేబినెట్ మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతమున్న రూ.10వేల రైతు భరోసాను రూ.12వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా” నామకరణం చేస్తున్నామన్నారు.
Also Read: Pawan Kalyan: చిరంజీవి వారసుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడు: పవన్ కల్యాణ్
ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయన్నారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానమని పేర్కొన్నారు.