Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:06 AM, Wed - 2 July 25

Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన రాజకీయ భవిష్యత్తు చుట్టూ తిరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాల వర్షాన్ని ముంచిన నేపథ్యంలో, స్వయంగా ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు వీరాభిమాని అని స్పష్టం చేస్తూ, వారి హిందూత్వ దిశానిర్దేశానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
Read Also: USA : ఉక్రెయిన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత
అయితే, బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తదుపరి రాజకీయ ప్రయాణం ఎటు దారితీస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రాజా సింగ్ ‘హిందూత్వ’ భావజాలానికి నిబద్ధత చూపుతూ మాట్లాడటం, ఆయన శివసేన పార్టీలో చేరతారన్న ఊహాగానాలకు బలం చేకూర్చింది. తెలంగాణలో శివసేన పార్టీ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ, రాజా సింగ్ లాంటి బలమైన హిందూత్వ నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నాయకత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీలో చేరితే రాష్ట్రంలో శివసేనను బలోపేతం చేయడానికి ఆవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారన్న వార్తలు కూడా ఈ నేపథ్యంలో మరలా వెలుగులోకి వస్తున్నాయి.
రాజా సింగ్ తాజా వ్యాఖ్యలు చూస్తే, ఆయన హిందూత్వ ప్రాధాన్యత ఉన్న మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తానే స్వయంగా తిరస్కారం పలికినప్పటికీ, ఆయన తదుపరి రాజకీయ గమ్యం ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. శివసేన వైపు అడుగులు వేయనున్నారా? లేదా మరో హిందూత్వపరమైన రాజకీయ వేదికను ఎంచుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రాజా సింగ్ తాను ఎటు పోతున్నారో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన చుట్టూ చర్చ నడుస్తోంది. హిందూత్వ ధృక్పథంలో రాజా సింగ్ తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
Read Also: Rains : హిమాచల్ ప్రదేశ్‌లో 10 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతు