యుద్దం వేళ వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 06-03-2026 - 3:21 IST
Published By : Hashtagu Telugu Desk
Narendra Modi పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. వంట గ్యాస్ బుకింగ్స్‌పైనా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా దేశంలో ఎల్పీజీ సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీల్ని ఆదేశించింది. ఇంకా దేశీయ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేస్తుండగా.. ఇరాన్ అమెరికా- ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపైనా భీకర దాడులు చేస్తోంది. ఇదే సమయంలో ముడి చమురు రవాణాకు కీలకంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అక్కడి నుంచి చమురు రవాణా నౌకల్ని కదలనీయట్లేదు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఇంధన రవాణా మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. దీంతో భారత్‌లో సహజ వాయువు సహా వంట గ్యాస్ సరఫరాపైనా ఈ ప్రభావం పడింది. ఈ క్రమంలో గ్యాస్ కొరత భయాలు నెలకొన్నాయి. గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.
>> పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్ లభ్యతను నిర్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పారిశ్రామిక అవసరాలకు కాకుండా.. గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరానే తొలి ప్రాధాన్యంగా ఉండాలని చమురు సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇతర ఎగుమతులకు కాకుండా.. దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇంకా ఈ ఎల్పీజీ.. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు మాత్రమే విక్రయించాలని తన ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది.
ఇందులో భాగంగానే.. LPG ఉత్పత్తికి కీలకంగా ఉన్నటువంటి బ్యూటేన్, ప్రొపేన్‌ను పెట్రో కెమికల్ ప్రొడక్షన్ కోసం దారి మళ్లించొద్దని రిఫైనరీలకు కేంద్రం సూచనలు చేసింది. దేశంలో ఎల్పీజీ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు దాదాపు 60 శాతం వరకు భారత్.. దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా.. రవాణాకు అంతరాయం కలిగినా దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో 33.2 కోట్లకుపైగా యాక్టివ్ LPG వినియోగదారులు ఉన్నారు.
గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు కనీస గడువు..
ఎల్పీజీ సరఫరాలో ప్రభావం నేపథ్యంలో.. ఆయిల్ కంపెనీలు ముందస్తు చర్యలకు దిగాయి. అంతకుముందు మాదిరిగా తక్కువ రోజుల వ్యవధిలో కాకుండా.. బుకింగ్- బుకింగ్ మధ్యలో కనీస గడువును బుధవారం నుంచే చమురు సంస్థలు అనధికారికంగా అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. డబుల్ సిలిండర్ ఉన్న వారికి గడువు 30 రోజులు.. సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజులుగా నిర్ణయించినట్లు సమాచారం. యుద్ధం ప్రభావంతో కొరత ఏర్పడుతుందని కొద్ది రోజులుగా గ్యాస్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చమురు సంస్థలు తాత్కాలికంగా గ్యాస్ బుకింగ్స్‌కు సంబంధించి ఇలా పరిమితులు విధిస్తున్నట్లు తెలుస్తోంది.