Telangana Record In Davos: దావోస్‌లో తెలంగాణ సరికొత్త రికార్డు.. 46 వేల మందికి జాబ్స్!
దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది.
- By Gopichand Published Date - 02:38 PM, Thu - 23 January 25

Telangana Record In Davos: దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు (Telangana Record In Davos) సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం.
దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి.
Also Read: IT Rides : దిల్ రాజు ఆఫీస్ లపై ఐటీ దాడులు..వెంకీ రియాక్షన్ ఇది..!
రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది.
దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్‌లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.