Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్
- Author : Vamsi Chowdary Korata
Date : 11-07-2026 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, తన పార్టీ శ్రేణులతో కలిసి పోలీసుల బారికేడ్లను, గేట్లను నెట్టుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. గని ప్రాంగణంలోనే కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను సింగరేణి భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ కాసేపు నెట్టులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్మిక సదస్సులో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా కేవలం వెయ్యి రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికుల చిరకాల డిమాండ్ అయిన డిపెండెంట్ ఉద్యోగాల (కారుణ్య నియామకాలు) భర్తీపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ ఈ విషయమై స్పందించకపోతే, కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 20వ తేదీన హెచ్‌ఎంఎస్ (HMS) కార్మిక సంఘం ఆధ్వర్యంలో తానే స్వయంగా సింగరేణి ప్రాంతంలో నిరాహార దీక్షకు కూర్చుంటానని కవిత డెడ్‌లైన్ విధించారు. కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.