Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడుగా అనర్హుడిగా ప్రకటించడం సమర్థనీయమా! రాహుల్ పై నమోదైన పరువునష్టం కేసు తీవ్రత ఎంత? న్యాయస్థానం విధించిన..
- Author : CS Rao
Date : 26-03-2023 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడుగా అనర్హుడిగా ప్రకటించడం సమర్థనీయమా! రాహుల్ పై నమోదైన పరువునష్టం కేసు తీవ్రత ఎంత? న్యాయస్థానం విధించిన శిక్ష ఎంత? కేసు రాజకీయ ప్రేరేపితమైనది అవునా! కాదా! న్యాయ స్థానాలపై రాజకీయ వత్తిళ్ళ ప్రభావం ఉందా! లేదా! దిగువ కోర్టులిచ్చిన తీర్పులపై పైకోర్టులకు అప్పీల్ కు వెళ్ళే పౌరుల హక్కును హరించడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా! రాజకీయ కక్షతో అమలుచేసే ఈ తరహా శిక్షల పర్యవసానాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయా! బలహీన పరుస్తాయా! అన్న కోణంలో లోతైన చర్చ జరగాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొంటే సరిపోదు, మన ప్రజాస్వామ్యం యొక్క నాణ్యతా ప్రమాణాలపై మన సమాజం దృష్టి సారించాలి.
బ్యాంకులను మోసం చేసి, దేశం నుండి పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, తదితరుల ఆర్థిక నేరాలపై ఒక రాజకీయ పార్టీ నేతగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2019లో వ్యాఖ్యలు చేశారట. ఒక ఇంటి పేరును బదనాం చేశారన్న ఆరోపణపై ఆయనపై సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం కేసు దాఖలైతే, కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. రాహుల్ వ్యాఖ్య సమర్థనీయం కాదు కూడా. కానీ, పార్లమెంటు సభ్యుడుగా ఉన్న రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఆగమేఘాలపై 24 గంటలలోపే అనర్హుడిగా ప్రకటించాల్సినంత నేరం ఆయన చేశారా! ఎందుకంత హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారన్నదే చర్చనీయాంశం.
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న ఆర్థిక నేరగాళ్లకు శిక్షలు లేవు. బ్యాంకులను మోసం చేసి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి విదేశాలకు పారిపోయిన నిరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకు ఇంకా శిక్షలు పడలేదు. బ్యాంకులను ముంచినవారిని శిక్షించకపోగా మొండి బాకీలుగా చెప్పబడుతున్న వాటిలో పది లక్షల కోట్లకుపైగా రద్దు చేయబడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రే పార్లమెంటులో వెల్లడించారు కదా! ఆధానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపిసి) వేసి, విచారణ జరపాలన్న ప్రతిపక్షాల డిమాండును మోడీ ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తున్నదో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.
తీవ్రమైన ఆర్థిక నేరాలు, హత్యా నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా, వాటిపై ఒక మాట ఎక్కువో, తక్కువో విమర్శించిన రాహుల్ ను ఇంత కఠినంగా శిక్షంచడం సమర్థనీయమా! అన్నదే ప్రశ్న.
అమరావతి రాజధానికి కులం రంగు పులిమిన ప్రభుత్వాధినేత, మంత్రులు, అధికార పార్టీ నేతలు ఒక కులాన్ని అప్రతిష్టపాలు చేశారని శిక్షలు విధించగలరా! రాజకీయ ప్రేరేపిత కక్షలు, కార్పణ్యాలు మిణుకుమిణుకుమంటున్న మన ప్రజాస్వామ్యం భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా పరిణమించవా!
Also Read: Glory of Sri Rama: శ్రీరామ నామ మహిమ