Curfew In Hyderabad: హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ.. ఏం జరుగుతోంది?
U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధించనున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 09:01 AM, Mon - 28 October 24

Curfew In Hyderabad: తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌లో నెల రోజులపాటు కర్ఫ్యూ
(Curfew In Hyderabad) విధించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సమాచారాన్ని సీవీ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నెల రోజులపాటు పోలీస్ ఆంక్షలు ఉండనున్నాయి. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధించనున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం నుంచి మొదలైన ఈ కర్ఫ్యూ నవంబర్ 28వరకు వరకు నెలరోజుల పాటు కొనసాగనుంది. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Cows : గోవులను అలా సంబోధించొద్దు.. బీజేపీ సర్కారు సంచలన ఆదేశాలు
అయితే పోలీసు కానిస్టేబుళ్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం అందుతోంది. ఆదివారం నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడదు. ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ నగరంలో తాజా పరిస్థితులను చూస్తే కర్ఫ్యూ విధించాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల పరంగా, పోలీస్ అధికారుల పరంగా కాస్త ఉద్రిక్త వాతావరణం నగరంలో నెలకొంది. ఒకవైపు కానిస్టేబుల్స్ ఆందోళన, మరో వైపు కేటీఆర్ బావమరిది జన్వాడ ఫామ్ హౌస్ పార్టీతో ప్రస్తుతం తెలంగాణ హీటెక్కుతోంది. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ విధించి మంచి పనిచేశారని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే కర్ఫ్యూ ఏ విషయమై విధించారో మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది.