Cows : గోవులను అలా సంబోధించొద్దు.. బీజేపీ సర్కారు సంచలన ఆదేశాలు
గోవులను(Cows) సంబోధించే క్రమంలో ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్తపడాలని నిర్దేశించింది.
- By Pasha Published Date - 08:50 AM, Mon - 28 October 24

Cows : గోవులను ఎలా సంబోధించాలి అనే విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ‘వీధి జంతువులు’ (స్ట్రే), ‘దారితప్పి తిరిగే జంతువులు’ అని వాటిని పిలవరాదని సర్కారు స్పష్టం చేసింది. గోవులను(Cows) సంబోధించే క్రమంలో ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్తపడాలని నిర్దేశించింది. ఈ పదాలు గోవులను అవమానించేలా, అనుచితంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి పదాలకు బదులుగా ‘నిరాశ్రయ జీవులు’ (డెస్టిట్యూట్), ‘నిస్సహాయ జీవులు’ అనే పదాలతో గోవులను సంబోధించాలని సూచించింది. ఇలాంటి పదాలు వాడేలా ఇతరులను కూడా ప్రోత్సహించాలని కోరింది. ఈ ఏడాది జులైలోనే ఈ అంశంపై రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి జోరారాం కుమావత్ ప్రకటన చేశారు. అయితే తాజాగా ఇప్పుడు దీనిపై అధికారిక ఆదేశాలు విడుదలయ్యాయి.
Also Read :Camphor : మీరు వాడే కర్పూరం నకిలీదనే డౌట్ ఉంటే.. ఇలా చెక్ చేయండి..!
గతంలో మంత్రి జోరారాం మాట్లాడుతూ.. ‘‘గోవులు, ఎద్దుల సంరక్షణ, సంక్షేమం కోసం మా బీజేపీ ప్రభుత్వం రాజీలేకుండా పనిచేస్తుంది. ఇందుకోసం ‘సీఎం పశుసంవర్ధక వికాస నిధి’ని ఏర్పాటు చేస్తాం. రూ.250 కోట్లతో ఆ నిధి ఏర్పాటు అవుతుంది’’ అని ప్రకటించారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం గోవుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మండిపడింది. కేవలం హామీలు, ప్రకటనలు తప్ప.. క్షేత్రస్థాయిలో గోవులను సంరక్షించే వారే కనిపించడం లేదని హస్తం పార్టీ నేతలు పేర్కొన్నారు. గోవుల సంరక్షణ, సంక్షేమం కోసం రాష్ట్రంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. ఇకనైనా ఈవిషయమై చేసిన ప్రకటనలన్నీ అమల్లోకి తేవాలని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద తాజాగా గోవులను సంబోధించే విషయమై రాజస్థాన్‌లోని బీజేపీ సర్కారు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు స్వాగతిస్తున్నారు. గోవుల గౌరవం పెంచేలా ఈ నిర్ణయం ఉందని అంటున్నారు.