Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు.
- By Pasha Published Date - 02:26 PM, Sat - 21 September 24

Sitaram Yechury : సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు అని, ఆయన్ను రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించే వారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు. సీతారాం ఏచూరిని కలిసి మాట్లాడినప్పుడల్లా జైపాల్ రెడ్డి తనకు గుర్తుకొచ్చే వారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు సీతారాం ఏచూరి పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ‘‘సీతారాం ఏచూరి బతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారు. మరణాంతరం కూడా ఆయన భౌతిక కాయం అందరికీ ఉపయోగపడాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పది’’ అని సీఎం రేవంత్ తెలిపారు. యూపీఏ హయాంలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో సీతారాం ఏచూరి క్రియాశీల పాత్ర పోషించారని చెప్పారు.
Also Read :Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
‘‘జమిలి ఎన్నికల ముసుగులో దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించాలన్న కుట్రకు బీజేపీ తెరతీసింది. ఇలాంటి కీలక సమయంలో సీతారాం ఏచూరి లాంటి నేత లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. సీతారాం ఏచూరి స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ప్రధాని స్పందించకపోవడం బీజేపీ ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇష్టానుసారంగా భాషను ప్రయోగించే వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.