KTR: ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు.
- By Praveen Aluthuru Published Date - 01:11 PM, Wed - 14 August 24

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం ఒక్క కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ను అమలు చేయకుండానే 50 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు కేటీఆర్.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు. అది కూడా ఒక్క కొత్త ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లేకుండా అని దుయ్యబట్టారు. రాబోయే సంవత్సరాలలో అదనంగా 4-5 లక్షల కోట్ల అప్పులు చేయనుందని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాలన పూర్తిగా కుప్పకూలిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచ్‌లు గత ఎనిమిది నెలలుగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని కేటీఆర్ ఆరోపించారు.
పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో గ్రామాల్లో ప్రజల జీవనం దినదినగండంగా మారింది. పంచాయతీల్లో దోమల మందులకు సైతం నిధులు లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆరోపించారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇదేనా మీ ప్రజల పాలన అని ప్రశ్నించారు కేటీఆర్.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలకు ప్రతినెలా రూ.275 కోట్లను సత్వరమే విడుదల చేసిందని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు అడిగినందుకు 1800 మంది మాజీ సర్పంచ్‌లను కాంగ్రెస్ హయాంలో అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు.15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన రూ.500 కోట్లను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఉపాధి హామీ పథకం, ఆరోగ్య మిషన్‌కు వచ్చిన రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని ప్రశ్నించారు.
Also Read: China : టెస్లాను దాటేసిన చైనా కంపెనీ.. పదిన్నర నిమిషాల్లోనే ఛార్జింగ్ అయ్యే ఈవీ బ్యాటరీ రెడీ