Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Author : Vamsi Chowdary Korata
Date : 11-07-2026 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఖమ్మం జిల్లాలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ (రైతు ఆశీర్వాద సభ) వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లక్ష్యంగా అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని సందర్శించి, మేడిగడ్డ బ్యారేజీలో తక్షణమే నీటిని నింపాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ లోపాలతో ఇప్పటికే కుంగిపోయిన మేడిగడ్డలో బలవంతంగా నీటిని నింపాలని చూడటం వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అవగాహన లేకుండా కేటీఆర్ చేస్తున్న ఇలాంటి డిమాండ్లు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో సీఎం ఈ సభ ద్వారా ప్రజలకు వివరించారు.
కేటీఆర్ డిమాండ్ చేసినట్లుగా మేడిగడ్డ బ్యారేజీలో గనక నీళ్లు నింపితే జరిగే ఊహించని విపత్తును సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ప్రస్తావించారు. “మేడిగడ్డలో గనక ఇప్పుడు నీళ్లు నింపితే ఆ కట్ట పూర్తిగా తెగిపోయి.. వరద ఉధృతికి పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలమే ఉండదురా దుర్మార్గుడా” అంటూ కేటీఆర్‌పై పరుష పదజాలంతో ఫైర్ అయ్యారు. మేడిగడ్డ కట్ట తెగితే గోదావరి పరివాహక ప్రాంతంలోని దాదాపు 44 గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోతాయని, భద్రాద్రి రాముడి గుడి సైతం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “మీ స్వార్థ పూరిత, లుచ్చా రాజకీయాల కోసం మేడిగడ్డను నింపి.. భద్రాచలాన్ని, ఆ రామయ్య గుడిని ముంచేయాలా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.