Big Shock To BRS: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్!
భవిష్యత్తులో ఎర్రుపాలెం, మధిర మండలంలోని కొన్ని గ్రామాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మరి కొన్ని గ్రామాలకు సాగర్ జలాలు అందించడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
- By Gopichand Published Date - 09:00 PM, Sun - 19 January 25

Big Shock To BRS: మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ (Big Shock To BRS) ఎదురైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎర్రుపాలెం మండలంలోని 31 గ్రామ పంచాయతీల నుంచి బీఆర్ఎస్ మండల, గ్రామస్థాయి నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం సాయంత్రం ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావ రామకృష్ణ, మాజీ ఎంపీపీ చావా అరుణ, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు పంబి సాంబశివరావు, వైస్ ఎంపీపీ రామకోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మలుపురి శ్రీనివాస్, మువ్వ స్వప్న, తదితరుల ఆధ్వర్యంలో వందల మంది బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read: Medak Collector Rahul Raj: మరోసారి టీచర్‌గా మారిన కలెక్టర్.. వీడియో వైరల్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాగద్వేషాలు లేకుండా మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అవకాశం వచ్చే విధంగా ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన మధిర ప్రజల రుణం తీర్చుకోవడానికి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మధిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకుని తిరిగే విధంగా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ టెయిలెండ్ థర్డ్ జోన్ లో ఉన్న ఎర్రుపాలెం వ్యవసాయ భూములను రెండో జోన్లోకి తీసుకువచ్చానని, త్వరలో ఆ పనులకు టెండర్ పిలువనున్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో ఎర్రుపాలెం, మధిర మండలంలోని కొన్ని గ్రామాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మరి కొన్ని గ్రామాలకు సాగర్ జలాలు అందించడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మధిరలో పాల విప్లవం తీసుకురావడానికి ఇందిరమ్మ డెయిరీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మధిరలో రానున్న పాల విప్లవంతో ఈ నియోజకవర్గ దేశంలోనే ఆదర్శంగా నిలువబోతుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడానికి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.