Tilak Varma: ఐపీఎల్ టూ ఆసియా కప్.. నెక్స్ట్ వరల్డ్ కప్పేనా?
ఎక్కడయినా అవకాశం ఒకేసారి వస్తుంది.. అది వచ్చినప్పుడు సరిగ్గా ఒడిసి పట్టుకోవాలి.. ఈ విషయంలో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తనకు వచ్చిన ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.
- By Naresh Kumar Published Date - 10:29 AM, Wed - 23 August 23

Tilak Varma: ఎక్కడయినా అవకాశం ఒకేసారి వస్తుంది.. అది వచ్చినప్పుడు సరిగ్గా ఒడిసి పట్టుకోవాలి.. ఈ విషయంలో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తనకు వచ్చిన ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే భారత్ క్రికెట్ జట్టులో చోటు కోసం ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా అందుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముందు వరకు కూడా తిలక్ వర్మ గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. గతేడాదే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐదు టీ ట్వంటీ సిరీస్‌లో అసాధారణ ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిణితితో ఆడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. లెఫ్టాండర్ కావడం, బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో టీమిండియా నాలుగో స్థానానికి తిలక్ వర్మ సరిగ్గా సరిపోతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అండర్ 19 టీమ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తిలక్ వర్మ ఆటను దగ్గరగా చూడటంతో అతనిపై ఉన్న నమ్మకంతో ఆసియాకప్‌కు ఎంపి చేశారు. ఒకవేళ ఆసియా కప్ లో ఆడే తుది జట్టులో చోటు దక్కీ తన జోరు కొనసాగిస్తే మాత్రం వాల్డ్ కప్ రేసులో నిలిచినట్టే. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా చెప్పాడు.
Also Read: Heath Streak: క్యాన్సర్ తో లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
ఆసియాకప్ అతనికి గొప్ప అవకాశమనీ , లెఫ్టాండర్ కావడం అతనికి అదనపు బలమన్నాడు. మెరుగ్గా రాణిస్తే ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడని అగార్కర్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌లో రాణిస్తే వన్డే ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడని పరోక్షంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తన కల అన్నాడు తిలక్ వర్మ . ఆసియాకప్‌లో భారత్ తరఫున బరిలోకి దిగడం తనకు గొప్ప విషయమని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. వన్డేల్లో కూడా తన జోరు కొనసాగించడంపై తిలక్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొత్తం మీద ఆసియా కప్ లో తిలక్ వర్మ సత్తా చాటితే వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం అందుకోవడంతో పాటు రెగ్యులర్ ప్లేయర్‌గా ఎదగడం ఖాయం.