ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!
భారతదేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతి మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవులకు అర్హురాలు.
- Author : Gopichand
Date : 17-03-2026 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
Supreme Court: ప్రసూతి సెలవులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయాన్ని వెలువరించింది. మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులను నిరాకరించలేమని కోర్టు పేర్కొంది. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ చట్టంలోని సెక్షన్ 60(4)ను కోర్టు రద్దు చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు 3 నెలలలోపు వయసున్న బిడ్డను దత్తత తీసుకుంటేనే 12 వారాల సెలవు ఇచ్చే నిబంధన ఉండేది.
సోషల్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 60(4) అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది. ప్రసూతి సెలవులను బిడ్డ వయస్సు పరిమితితో ముడిపెట్టే నిబంధనను కోర్టు రద్దు చేసింది. పితృత్వ సెలవుల (Paternity Leave)పై కూడా చట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తల్లి అయ్యే ప్రతి మహిళకు ప్రసూతి సెలవు పొందే హక్కు ఉంది. అది బిడ్డకు జన్మనిచ్చినా లేదా దత్తత తీసుకున్నా వర్తిస్తుంది. దీనికి బిడ్డ వయస్సుతో సంబంధం లేదు. “కుటుంబం కేవలం పుట్టుకతోనే కాదు ప్రేమ, సంరక్షణతో కూడా ఏర్పడుతుంది. దత్తత తీసుకున్న బిడ్డ కుటుంబంలో కలిసిపోవడానికి తగిన సమయం ఇవ్వాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది.
భారతదేశంలో ప్రసూతి సెలవుల నిబంధనలు
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, 2017 సవరణల ప్రకారం.. మొదటి ఇద్దరు పిల్లల తల్లికి 26 వారాలు (సుమారు 6 నెలలు) ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇందులో గరిష్టంగా 8 వారాల సెలవును ప్రసవానికి ముందే తీసుకోవచ్చు. మూడవ బిడ్డ నుంచి 12 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఒకవేళ గర్భస్రావం జరిగితే 6 వారాల సెలవు తీసుకోవచ్చు. బిడ్డను దత్తత తీసుకున్న తల్లికి 12 వారాల (సుమారు 3 నెలలు) సెలవు పొందే హక్కు ఉంది. ఇప్పటివరకు బిడ్డ వయస్సు 3 నెలల కంటే ఎక్కువ ఉంటే ఈ సెలవు లభించేది కాదు. కానీ తాజా తీర్పుతో దత్తత తీసుకునే ప్రతి మహిళకు 12 వారాల సెలవు తప్పనిసరి.
Also Read: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్?!
ఎవరికి ఈ సెలవులు వర్తిస్తాయి?
భారతదేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతి మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవులకు అర్హురాలు. ఏదైనా కంపెనీలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ ఖచ్చితంగా మెటర్నిటీ యాక్ట్‌ను అనుసరించాలి. ఈ సెలవు కాలంలో కంపెనీ మహిళా ఉద్యోగికి పూర్తి జీతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020 – సెక్షన్ 60 అంటే ఏమిటి?
వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు, గిగ్ వర్కర్ల హక్కులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో ఈ కోడ్‌ను అమలు చేసింది. దీనిలోని సెక్షన్ 60 ప్రసూతి ప్రయోజనాల గురించి చెబుతుంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కింద సెలవు కాలంలో జీతం పొందే హక్కు ఉంది. ఈ ప్రయోజనం పొందాలంటే మహిళ తన ప్రసవ తేదీకి ముందు 12 నెలల కాలంలో కనీసం 80 రోజులు ఆ సంస్థలో పనిచేసి ఉండాలి. గరిష్టంగా 26 వారాల సెలవు (ఇద్దరు పిల్లల వరకు) ఉంటుంది. ఒక మహిళ మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే, ఆమెకు 12 వారాల సెలవు వర్తిస్తుంది. (ఈ బిడ్డ వయస్సు నిబంధననే ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసింది). పని స్వభావాన్ని బట్టి సెలవు ముగిసిన తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. సుప్రీంకోర్టు తన తీర్పులో దత్తత తీసుకున్న బిడ్డ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి తల్లికి 12 వారాల సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది.