Champions Trophy 2024: జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయితే జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండొచ్చని స్పష్టం అవుతుంది.
- By Praveen Aluthuru Published Date - 09:43 PM, Tue - 27 August 24

Champions Trophy 2024: ఐసీసీలో చాలారోజుల తర్వాత పూర్తిస్థాయిలో బీసీసీఐ హవా మొదలవుతోంది. నిజానికి ప్రపంచ క్రికెట్ లో అటు ఆటలోనూ, ఇటు ఆదాయంలోనూ భారత్ ది ప్రత్యేక స్థానం.. అత్యంత ధనిక బోర్డుగా , తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఐసీసీకి అత్యధిక ఆదాయం అందించే దేశంగా భారత్ కు పేరుంది. అందుకే ఐసీసీలో ఎప్పుడూ భారత్ ఆధిపత్యం కనబరుస్తూ ఉంటుంది. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పొవార్, శశాంక్ మనోహర్, శ్రీనివాసన్ ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం బీసీసీఐ సెక్రటరీ జైషాకు దక్కింది. 35 ఏళ్ళ ఐసీసీ బాస్ గా ఎన్నికై రికార్డు సృష్టించిన జై షా అడ్మినిస్ట్రేషన్ లో మంచి అనుభవమే ఉంది. కాగా జైషా ఎంట్రీతో పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ కు చెక్ పడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తోంది. ఎట్టపరిస్థితుల్లోనూ టోర్నీని పాక్ లోనే నిర్వహించాలని పిసిబి పట్టుదలగా ఉంది. టోర్నీలో ఆడుతున్న 8 జట్లలో ఏడు పాక్ వెళ్ళేందుకు దాదాపు అంగీకరించినా.. భారత్ మాత్రం నో చెప్పింది. పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని ఐసీసీకి తేల్చి చెప్పేసింది. తమ మ్యాచ్ లో హైబ్రిడ్ మోడల్ విధానంలో తటస్థ వేదికలో నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేసింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిని ఒప్పుకోకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు అత్యుత్సాహానికి ఐసీసీ ఛైర్మన్ హోదాలో జైషా చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లను తటస్థ వేదికలకు మారడం ఖాయమైనట్టే. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ లో ఈ మెగా టోర్నీ నిర్వహించడం తప్పిస్తే పాక్ కు మరో మార్గం లేదు.
భారత్ మ్యాచ్ లను శ్రీలంక లేదా యూఏఈ వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాల్సిందే. ఎందుకంటే ఎట్టిపరిస్థితుల్లోనూ భారత జట్టు పాక్ కు వెళ్ళదు. ఒకవేళ భారత్ టోర్నీ నుంచి వైదొలిగితే అది ఆతిథ్య జట్టుకే కాదు ఐసీసీకి కూడా భారీ నష్టాన్ని మిగులుస్తుంది. టీమిండియా లాంటి టాప్ టీమ్ ఆడకపోతే టోర్నీకి రేటింగ్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే గతంలో ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు.
Also Read: Sajjala Ramakrishna Reddy: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సజ్జల ఏమన్నారంటే..?