Virat- Rohit Retirement: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్లు రోహిత్, విరాట్..!
- Author : Gopichand
Date : 30-06-2024 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
Virat- Rohit Retirement: ఒకవైపు సంతోషంగా ఉంటూనే మరోవైపు కోట్లాది మంది భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించడంతో భారత క్రికెట్ శకం ముగియనుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Virat- Rohit Retirement) కూడా ఓ కీలక ప్రకటన చేశాడు. రోహిత్ కూడా T-20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపాడు. ఫైనల్‌లో విజయం సాధించిన అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇది నా చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్
భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. ఇది నా చివరి టీ20 మ్యాచ్. ఈ ఫార్మాట్‌కి వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. అంతర్జాతీయ టీ20లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌లో ఆడుతూ భారత్‌కు నా కెరీర్‌ను ప్రారంభించానని రోహిత్ చెప్పాడు. నేను ప్రపంచకప్ గెలవాలనుకున్నాను. గెలిచాను అని చెప్పుకొచ్చాడు.
మాటల్లో వ్యక్తీకరించడం కష్టం
రోహిత్ మాట్లాడుతూ.. నేను చాలా కోరుకున్నాను. దాన్ని మాటల్లో వివరించడం కష్టంగా ఉంటుంది. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఈ టైటిల్ కోసం చాలా సార్లు నిరాశకు లోనయ్యా. ఎట్టకేలకు ఈ మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు.
Also Read: Virat Kohli Retirement: విరాట్ సంచలన నిర్ణయం… టీ ట్వంటీలకు కోహ్లీ గుడ్ బై
వన్డే, టెస్టుల్లో రోహిత్ ఆడతాడు
అయితే టెస్టు, వన్డేల్లో మాత్రం కొనసాగుతానని రోహిత్ ధృవీకరించాడు. అంటే అతను అంతర్జాతీయ క్రికెట్‌లోని రెండు ఫార్మాట్లలో ఆడడాన్ని భారత అభిమానులు చూడగలరు. ఇదే సమయంలో రాహుల్ ద్రవిడ్ కూడా ఇకపై టీమ్ ఇండియాతో ఏ ఫార్మాట్‌లో కనిపించడు. కోచ్‌గా అతని పదవీకాలం ముగిసింది. ఈ విధంగా ఈ ప్రపంచకప్ తర్వాత ముగ్గురు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ వీడ్కోలు పలుకుతున్నారు.
అత్యధిక పరుగుల రికార్డు
ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ ఈ ఫార్మాట్ నుంచి రిటైరవ్వడమే కాకుండా ప్రపంచ రికార్డు కూడా అతని పేరిటే నమోదైంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రోహిత్. 159 టీ20 మ్యాచ్‌ల్లో 4231 పరుగులతో రోహిత్ కెరీర్ ముగించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా ఐదు సెంచరీలు చేసిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది.
We’re now on WhatsApp : Click to Join
రోహిత్ ఇంతకు ముందు టీ20 ప్రపంచకప్ 2007లో ప్లేయర్‌గా ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా అవతరించాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన భారత కెప్టెన్, 19 సెప్టెంబర్ 2007న ఇంగ్లండ్‌పై తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. విశేషమేమిటంటే.. ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ కు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత మైదానంలోకి వచ్చినప్పుడల్లా.. కోట్లాది హృదయాలను శాసిస్తూ చరిత్ర సృష్టిస్తూనే ఉన్నాడు.
టీ20లకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ
రోహిత్ కంటే ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పాడు. వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాపై ఫైనల్ గెలిచిన అనంతరం రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే చివరి వరల్డ్ కప్. టీ20 మ్యాచ్ కూడా. కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను టీ20లకు దూరమవుతున్న అని కోహ్లీ తెలిపాడు.