Vaibhav Suryavanshi: 13 ఏళ్ళ బుడ్డోడు వైభవ్ ఊచకోతకు రాజస్థాన్ ఫిదా
ఇటీవల జరిగిన మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ తనను కోటి పెట్టి ఎందుకు తీసుకుందో చూపించాడు. ఇక ఈ కీలక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- By Gopichand Published Date - 08:45 PM, Thu - 5 December 24

Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేలంలో హాట్ టాపిక్ అయిన 13 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అండర్ 19 ఆసియాకప్ లో విధ్వంసం సృష్టించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ మూడో మ్యాచ్ లో పరుగుల వరద పారించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసిన ఈ చిన్నోడు జపాన్‌తో జరిగిన రెండో మ్యాచ్ లో 23 పరుగులకే వెనుదిరిగాడు. అయితే యూఏఈతో జరిగిన మూడో మ్యాచ్‌లో బ్యాట్ ఝళిపించాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ 165కి పైగా స్ట్రైక్ రేటుతో ఊచకోత కోశాడు.
ఇటీవల జరిగిన మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ తనను కోటి పెట్టి ఎందుకు తీసుకుందో చూపించాడు. ఇక ఈ కీలక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా పది వికెట్లతో ఘనవిజయం సాధించింది. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శుక్రవారం శ్రీలంకతో భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. అటు పాకిస్థాన్ కూడా సెమీస్ చేరింది. డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ పోరులో భారత్ – పాక్ తలపడతాయని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Highest Ever T20 Total: టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు.. సిక్కింపై బరోడా 349 పరుగులు నమోదు
వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలంటే.. శ్రద్ధగా సిక్సర్లు బాదుతూ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో విఫలమై తనను తాను నిరూపించుకోవాల్సిన సమయంలో కసిగా ఆడాడు. మైదానం నలువైపులా షాట్లతో తన తడాఖాను చూపెట్టాడు. వైభవ్ దూకుడైన ఆటకు రాజస్థాన్ ఫిదా ఐంది. వచ్చే ఐపీఎల్ లో ప్లేయింగ్ లెవెన్ లో తనను కచ్చితంగా ఉంచాలని ఆర్ఆర్ భావిస్తుంది. 2008లో జరిగిన తొలి సీజన్ లో విజేతగా నిలిచిన రాజస్థాన్ కు ఆ తర్వాత టైటిల్ అందని ద్రాక్షగా మారింది. ఓ సీజన్లో ఫైనల్లోకి వెళ్లినప్పటికీ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఉండటంతో ఆర్ఆర్ కు ఓటమి తప్పలేదు. ఈసారి లోకల్ ట్యాలెంట్ ను చేరదీసి, మళ్లీ విజేతగా నిలవాలని రాజస్థాన్ ఊవిళ్లూరుతోంది.