West Indies vs Scotland: విండీస్ కు షాక్.. స్కాట్లాండ్ సంచలన విజయం
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తొలి రోజు శ్రీలంకకు నమీబియా షాక్ ఇస్తే తాజాగా వెస్టిండీస్ పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది.
- Author : Gopichand
Date : 17-10-2022 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తొలి రోజు శ్రీలంకకు నమీబియా షాక్ ఇస్తే తాజాగా వెస్టిండీస్ పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జోన్స్ , మున్సి తొలి వికెట్ కు 55 రన్స్ జోడించారు. వికెట్లు పడుతున్నా జోన్స్ చివరి వరకూ క్రీజులో ఉండడంతో స్కాట్లాండ్ 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. జోన్స్ 66 రన్స్ తో అజేయంగా నిలిచాడు.
టార్గెట్ మరీ పెద్దది కాకున్నా విండీస్ పెద్దగా పోటీ ఇవ్వలేక పోయింది. ఆరంభం నుంచే వికెట్లు చేజార్చుకుంది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో నిలువలేక పోయారు. లూయిస్ , పూరన్, బ్రాండన్ కింగ్ , బ్రూక్స్ , పావెల్ తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. దీంతో కరేబియన్ టీమ్ 79 రన్స్ కే 8 వికెట్లు కోల్పోయింది. కనీసం వంద రన్స్ అయినా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో హోల్డర్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే సహచరుల నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. హోల్డర్ 38 రన్స్ చేయగా…విండీస్ ఇన్నింగ్స్ కు 118 పరుగుల దగ్గర తెరపడింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వ్యాట్ 3 , బ్రాడ్ వీల్ 2 , లీస్క్ 2 వికెట్లు పడగొట్టారు. రెండుసార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన విండీస్ క్వాలిఫైయింగ్ టోర్నీ ఆడడంపై కరేబియన్ ఫాన్స్ నిరాశలో ఉంటే…ఇప్పుడు స్కాట్లాండ్ చేతిలో ఓటమి మరింత షాక్ అనే చెప్పాలి.