IND vs SL : శ్రీలంకలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు శ్రీలంకలో అడుగుపెట్టారు.
- By News Desk Published Date - 04:12 PM, Mon - 29 July 24

IND vs SL : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు శ్రీలంకలో అడుగుపెట్టారు. ఆగస్టు 2 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం కొలంబో(Colombo) చేరుకున్నారు. వీరితో పాటు వన్డే జట్టుకు ఎంపికైన కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav), హర్షిత్ రాణా(Harshit Rana)లు సైతం ఉన్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీసీ రత్నదీప్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు.
నేడు (జూలై 29 సోమవారం) జరిగే నెట్ సెషన్‌లో వీరంతా పాల్గొననున్నారు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో వీరు నెట్స్‌లో శ్రమించనున్నారు. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 అనంతరం పల్లెకలె నుంచి నాయర్ కొలంబో వెళ్లాడు. మంగళవారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు కూడా రోహిత్ సేనతో చేరనున్నారు.
టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరు చివరి సారిగా వన్డేలు ఆడారు. ఈ క్రమంలో ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో వీరు ఎలా ఆడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
వన్డే సిరీస్ షెడ్యూల్..
ఆగస్టు 2 – తొలి వన్డే
ఆగస్టు 4 – రెండో వన్డే
ఆగస్టు 7 – మూడో వన్డే
ఈ మూడు వన్డేలు కొలంబోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి.
Also Read : IRE vs ZIM : ఫోర్ పోకుండా ఆపావు.. 5 రన్స్ వచ్చాయ్.. ఏం లాభం నాయనా..?