WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను భారత్‌లో నిర్వహించకపోవడానికి గల కారణాలీవే!
ఇంగ్లండ్ ఐసీసీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన వేదిక. గతంలో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2019 వరల్డ్ కప్, గత WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇంగ్లండ్ ఒక నిరూపితమైన, విజయవంతమైన వేదికగా ఉంది.
- Author : Gopichand
Date : 21-07-2025 - 1:13 IST
Published By : Hashtagu Telugu Desk
WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ (WTC Final)ను 2027, 2029, 2031లో కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి గల బలం దృష్ట్యా.. చాలా మంది ఈ ఫైనల్స్ భారతదేశంలో జరుగుతాయని ఆశించారు. అయితే, ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
జూన్ నెలలో వాతావరణం అనుకూలత
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కోసం ఐసీసీ జూన్ నెలను ఎంచుకుంది. గత మూడు ఫైనల్స్ జూన్‌లోనే జరిగాయి. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగే అవకాశం ఉంది. భారతదేశంలో జూన్ నెలలో తీవ్రమైన వేడి ఉంటుంది. ఇది టెస్ట్ క్రికెట్ వంటి సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆడటానికి ఆటగాళ్లకు చాలా కష్టం. అదే సమయంలో ఇంగ్లండ్‌లో జూన్ నెలలో వాతావరణం ఆహ్లాదకరంగా, టెస్ట్ మ్యాచ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఈ వాతావరణ అనుకూలతే ఇంగ్లండ్‌ను ప్రాధాన్యతగా ఎంచుకోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి.
టెస్ట్ క్రికెట్‌కు ఇంగ్లండ్‌లో లభించే గౌరవం
భారతదేశంలో క్రికెట్‌కు విశేష ఆదరణ ఉన్నప్పటికీ టెస్ట్ క్రికెట్‌కు లభించే జనాదరణ టీ20, వన్డేల కంటే కొంత తక్కువ. టెస్ట్ మ్యాచ్‌లకు మైదానాల్లో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. దీనికి విరుద్ధంగా ఇంగ్లండ్‌లో టెస్ట్ క్రికెట్‌కు ఒక ప్రత్యేకమైన గౌరవం, ఆదరణ ఉంటాయి. అక్కడ టెస్ట్ మ్యాచ్‌లకు స్టేడియాలు నిండుగా ఉంటాయి. ఇది ఐసీసీకి ప్రధాన అంశం. పెద్ద మ్యాచ్‌లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులు హాజరవ్వడం టోర్నమెంట్ విజయానికి కీలకం.
Also Read: Outer Ring Rail Project : తెలంగాణ మణిహారంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు
పాకిస్తాన్ భాగస్వామ్యంపై అనిశ్చితి
భవిష్యత్తులో పాకిస్తాన్ WTC ఫైనల్‌కు అర్హత సాధిస్తే భారతదేశంలో మ్యాచ్ జరిగితే వారి భాగస్వామ్యం అనిశ్చితంగా మారవచ్చు. భారత-పాకిస్తాన్ సంబంధాలలో సున్నితత్వాల దృష్ట్యా ఐసీసీ చివరి నిమిషంలో వేదికను మార్చే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు. ఇంగ్లండ్‌లో మ్యాచ్ నిర్వహించడం ద్వారా ఏ జట్టు ఫైనల్‌కు చేరుకున్నా, మ్యాచ్ సజావుగా జరిగేలా ఐసీసీ నిర్ధారించుకోవచ్చు.
భారత్ లేకపోతే ఫైనల్ ఆదరణ కోల్పోవడం
భారతదేశంలో ఐసీసీ టోర్నమెంట్‌లలో భారత జట్టు పాల్గొనని మ్యాచ్‌లకు ప్రేక్షకుల హాజరు తక్కువగా ఉంటుంది. ఒకవేళ భారత్ WTC ఫైనల్‌కు అర్హత సాధించకపోతే ఇతర జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు భారతదేశంలో ప్రేక్షకుల ఆదరణ తక్కువగా ఉండవచ్చ. తద్వారా మ్యాచ్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, విదేశీ ఆటగాళ్లకు భారతీయ పిచ్‌లను అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. ఇది మ్యాచ్ నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఇంగ్లండ్‌లో ఈ సమస్య తక్కువగా ఉంటుంది.
ఇంగ్లండ్ ఐసీసీకి మొదటి ఎంపిక
ఇంగ్లండ్ ఐసీసీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన వేదిక. గతంలో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2019 వరల్డ్ కప్, గత WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇంగ్లండ్ ఒక నిరూపితమైన, విజయవంతమైన వేదికగా ఉంది. మౌలిక సదుపాయాలు, అభిమానుల మద్దతు, నిర్వహణ సామర్థ్యం వంటి అంశాల్లో ఇంగ్లండ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. అందుకే ఐసీసీ రాబోయే ఫైనల్స్ కోసం కూడా ఇంగ్లండ్‌ను మొదటి ఎంపికగా నిర్ణయించింది.