WI vs IND: కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఆడాను: హార్దిక్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా విజయయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ మ్యాచ్ లో కరేబియన్లను ఉతికారేసిన భారత ఆటగాళ్లు మూడు వన్డే సిరీస్ లోను అదే దూకుడైన ఆటతో సత్తా చాటారు.
- Author : Praveen Aluthuru
Date : 02-08-2023 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
WI vs IND: వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా విజయయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ మ్యాచ్ లో కరేబియన్లను ఉతికారేసిన భారత ఆటగాళ్లు మూడు వన్డే సిరీస్ లోను అదే దూకుడైన ఆటతో సత్తా చాటారు. మొదటి వన్డేలో గెలుపొందిన టీమిండియా రెండో వన్డేలో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేయడంతో తక్కువ పరుగులకే కుప్పకూలింది. దీంతో విండీస్ బ్యాటర్లు సునాయాసంగా నెట్టుకొచ్చారు. అయితే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నలుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో భారత్ 351 పరుగుల భారీ స్కోర్ రాబట్టింది. అయితే మ్యాచ్ కు ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్య కోహ్లీతో మాట్లాడాడు. కోహ్లీ ఇచ్చిన సలహాలను పాటించానని, అందుకే నిలకడగా ఆడానని తెలిపాడు పాండ్య.
మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ పాండ్యతో ఇలా చెప్పాడట. 50 ఓవర్ల ఫార్మేట్ లో నిలకడగా ఆడాలని, ఎక్కువసేపు క్రీజులో ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చాడట. కోహ్లీ సలహా మేరకు మైదానంలోకి అడుగుపెట్టిన పాండ్య నిలకడగా ఆడుతూ కనిపించాడు. కోహ్లీ మాటలను బాగా వంటబట్టించుకున్న పాండ్య కీలక మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ ఔట్ అయిన తరువాత పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తో నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 35 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరుకోగా.. చివరిలో జడేజాతో కలిసి హార్దిక్ పాండ్యా స్పీడ్ పెంచాడు. దీంతో 52 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్-10 బ్యాట్స్‌మెన్ లో రోహిత్ ఒక్కడే..!