GT : గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు తప్పిన పెనుప్రమాదం
- Author : Prasad
Date : 01-06-2026 - 8:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఐసీఎల్ ఫైనల్‌లో ఓటమితో నిరాశ చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో జట్టు సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఆటగాళ్లను, సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎవరికిఎలాంటి గాయాలు కాలేదు. వారిని తిరిగి టీమ్ హోటల్‌కు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసే వరకు జట్టు సభ్యులు రోడ్డుపైనే వేచి ఉన్నారు.
ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్‌కు, నిరాశతో ఉండగా ఈ బస్సు ప్రమాదం మరింత ఆందోళన కలిగించింది. మే 29న రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్ 2 పోరు కోసం ధర్మశాల నుండి ముల్లన్‌పూర్‌కు ప్రయాణించిన తర్వాత.. ప్రతికూల వాతావరణం కారణంగా జట్టు ప్రయాణ అంతరాయాలను ఎదుర్కొంది. మే 30న అహ్మదాబాద్‌కు వారు ఉదయం వెళ్లాల్సి ఉండగా.. ప్రయాణం ఆలస్యం కావడంతో, ఆ జట్టు శనివారం సాయంత్రానికి చేరుకుంది. ఫైనల్‌లో గుజరాత్ పేలవ ప్రదర్శనకు బిజీ షెడ్యూల్, ప్రయాణ అలసట కారణమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వంద శాతం కారణం అదికాదని విశ్లేషకులు భావిస్తున్నారు