Kuldeep Yadav: టెస్ట్ క్రికెట్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుత పునరాగమనం!
భారత్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కుల్‌దీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.
- By Gopichand Published Date - 08:25 PM, Thu - 2 October 25

Kuldeep Yadav: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బౌలింగ్ చేసింది. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav) తన పునరాగమనాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. అతను తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ఉచ్చులో పడేశాడు.
ఏడాది తర్వాత అద్భుతమైన రీఎంట్రీ
కుల్‌దీప్ యాదవ్ తన చివరి టెస్ట్ మ్యాచ్ దాదాపు ఒక సంవత్సరం క్రితం అంటే అక్టోబర్ 16, 2024న బెంగళూరులో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఆ తర్వాత అతను టీమ్ ఇండియా తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అయితే ఒక సంవత్సరం తర్వాత వెస్టిండీస్‌పై భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కుల్‌దీప్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను వెస్టిండీస్ జట్టుకు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను తన లక్ష్యం చేసుకున్నాడు. కెప్టెన్ షై హోప్ వికెట్‌తో పాటు జోమెల్ వర్కిన్‌ను కూడా పెవిలియన్ దారి పట్టించాడు. కుల్‌దీప్ యాదవ్ 6.1 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఈ రెండు కీలక వికెట్లు తీశాడు.
Also Read: IT Industry Performamce: షాకింగ్ రిపోర్ట్.. మందగిస్తున్న భారత ఐటీ రంగం!
గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా కుల్‌దీప్ యాదవ్‌కు భారత జట్టులో అవకాశం దక్కలేదు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కూడా అతన్ని ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోలేదు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన కుల్‌దీప్, రెండు ముఖ్యమైన వికెట్లు తీసి భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసి తన రీఎంట్రీని గుర్తుండిపోయేలా చేసుకున్నాడు.
162 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్
వెస్టిండీస్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ 44.01 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. జట్టు తరఫున ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా జస్టిన్ గ్రీవ్స్ నిలిచాడు. అతను 48 బంతుల్లో నాలుగు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. కెప్టెన్ షై హోప్ 36 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
భారత్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కుల్‌దీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (53*), గిల్ (18) పరుగులతో ఉన్నారు. జైస్వాల్ (36), సాయి సుదర్శన్ (7) పరుగులు చేసి ఔటయ్యారు.