టీమిండియాకు తొలి విజయం.. మొదటి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!
విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్) చేశారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ ఆయన తన వన్డే కెరీర్లో 77వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు.
- Author : Gopichand
Date : 11-01-2026 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
IND Beat NZ: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వడోదరలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 300 పరుగులు చేయగా, భారత్ మరో 4 వికెట్లు మిగిలి ఉండగానే 49వ ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 93 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీతో రాణించారు. 2026 సంవత్సరంలో భారత జట్టుకు ఇదే మొదటి విజయం.
గిల్ అర్ధసెంచరీ
301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఆరంభం అంతగా కలిసిరాలేదు. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద ఉండగా రోహిత్ శర్మ (26) అవుట్ అయ్యారు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంయమనంతో ఆడి 56 పరుగులు (71 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టును ఆదుకున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన తర్వాత పునరాగమనం చేస్తూ గిల్ ఈ కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Also Read: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!
రోహిత్ నిరాశపరిచినా.. విరాట్ విశ్వరూపం
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 26 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. ఒకానొక దశలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు విజయం నల్లేరుపై నడకలా అనిపించింది.
కోహ్లీ రికార్డుల పరంపర
విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్) చేశారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ ఆయన తన వన్డే కెరీర్లో 77వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (624) 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్‌లు) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కుమార సంగక్కరను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నారు. కోహ్లీ తన చివరి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో కలిపి మొత్తం 469 పరుగులు చేయడం ఆయన ఫామ్‌కు నిదర్శనం. భారత జట్టు ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.