అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి.. ఎవరా క్రికెటర్ మీకు తెలుసా ?
- Author : Vamsi Chowdary Korata
Date : 30-12-2025 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
Hardik Pandya : భారత టెస్ట్ క్రికెట్ స్థిరత్వం కోసం మాజీ ఆటగాళ్లు అనుభవజ్ఞుల పాత్రపై దృష్టి సారించారు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి తిరిగి రావాలని రాబిన్ ఉతప్ప సూచించారు. నెం 7 స్థానంలో హార్దిక్ ఆడితే జట్టుకు బలం చేకూరుతుందని, ఫిట్నెస్, ఫామ్ ఉంటే కమ్ బ్యాక్ అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ గెలవాలనే హార్దిక్ ఆశ కూడా దీనికి కారణం. 2017లో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
- టెస్టుల్లో టీమిండియా పతనం
- కమ్ బ్యాక్ ఇవ్వాలంటే పాండ్యా రావాలి
- మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయం
భారత టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం స్థిరత్వం లేక ఓటములతో సతమతమవుతోంది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత జట్టు కొత్త సమతౌల్యం కోసం ప్రయత్నిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఎదురైన పరాజయం ఈ మార్పుల ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఈ నేపథ్యంలో భారత జట్టును మళ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీలో నిలబెట్టేందుకు అనుభవజ్ఞుల పాత్ర కీలకమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్‌కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో నెం.7 స్థానంలో హార్దిక్ ఆడితే జట్టుకు గణనీయమైన బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుత ఫిట్నెస్, ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుంటే హార్దిక్ టెస్ట్ కమ్ బ్యాక్ అసాధ్యం కాదని, క్రికెట్లో “నెవర్ సె నెవర్” అన్నది వర్తిస్తుందని ఉతప్ప వ్యాఖ్యానించాడు.
హార్దిక్ పాండ్యాకు టెస్టుల్లో బౌలింగ్ లోడే ప్రధాన ప్రశ్నగా మారిందని ఉతప్ప చెప్పాడు. అయితే ఒక ఇన్నింగ్స్‌కు 12 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే అతడు తన పాత్రను సమర్థంగా నిర్వర్తించగలడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇతర ఆల్‌రౌండర్లు కూడా భారీగా ఓవర్లు బౌలింగ్ చేయడం లేదని, అలాంటి పరిస్థితుల్లో హార్దిక్‌ను పక్కన పెట్టాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలన్న ఆసక్తిని హార్దిక్ వ్యక్తపరిస్తే, అతడి ఫిట్నెస్ నిరూపితమైతే బీసీసీఐ కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేదని ఉతప్ప అభిప్రాయం.
2017లో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే గాయాల సమస్యల కారణంగా 2018 తర్వాత అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతడి పాత్ర అత్యంత కీలకమైనదని భావిస్తున్న బీసీసీఐ, అతడి వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహిస్తూ వస్తోంది. అందుకే హార్దిక్ ఎక్కువగా వైట్‌బాల్ క్రికెట్‌పైనే దృష్టి సారించాడు.
అయితే హార్దిక్ ఇప్పటికే టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ వంటి ఐసీసీ ట్రోఫీలను గెలిచిన నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలన్న ఆశ కూడా అతడిలో ఉండటం సహజమని ఉతప్ప పేర్కొన్నాడు. టెస్టుల్లో తిరిగి ఆడి డబ్ల్యూటీసీ గెలిస్తే అది అతడి కెరీర్లో గ్రాండ్ స్లామ్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడి సేవలు మళ్లీ టెస్టుల్లో అవసరమా అనే చర్చ ఇప్పుడు మరింత ఊపందుకుంది.