BCCI: డ్రీమ్ 11తో స్పాన్సర్‌షిప్ డీల్ రద్దు.. బీసీసీఐకి నష్టం తప్పదా?
రూ. 358 కోట్ల ఒప్పందంలో సగానికి పైగా మొత్తం ఇప్పటికే బీసీసీఐకి అందినప్పటికీ.. మిగిలిన కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతకడం అంత సులభం కాదు. ఇది బీసీసీఐకి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించవచ్చు.
- By Gopichand Published Date - 09:45 PM, Sun - 24 August 25

BCCI: భారత ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభలలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే గేమ్‌లు ఇకపై భారతదేశంలో నిషేధించబడతాయి. దీనివల్ల డ్రీమ్11 వంటి ప్రముఖ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
డ్రీమ్11 – బీసీసీఐ స్పాన్సర్‌షిప్ డీల్ రద్దు?
నివేదికల ప్రకారం.. 2023లో బీసీసీఐకి (BCCI) అధికారిక స్పాన్సర్‌గా డ్రీమ్11 ఎంపికైంది. ఈ డీల్ విలువ రూ. 358 కోట్లు. ఇది మార్చి 2026 వరకు అంటే మూడు సంవత్సరాల కాలానికి కుదిరింది. అయితే ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం తర్వాత డ్రీమ్11 భారీ నష్టాలను చవిచూసింది. ఈ కారణంగా డ్రీమ్11 బీసీసీఐతో కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుందని ఓ జాతీయ మీడియా కథనంలో పేర్కొంది.
బీసీసీఐకి నష్టాలు తప్పవా?
ఈ ఒప్పందం గడువు ముగియడానికి ఇంకా ఒక సంవత్సరం కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ డ్రీమ్11 తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల బీసీసీఐకి నష్టం తప్పదని నిపుణులు భావిస్తున్నారు. రూ. 358 కోట్ల ఒప్పందంలో సగానికి పైగా మొత్తం ఇప్పటికే బీసీసీఐకి అందినప్పటికీ.. మిగిలిన కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతకడం అంత సులభం కాదు. ఇది బీసీసీఐకి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించవచ్చు.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో భారతదేశంలో అనేక కంపెనీలు తమ వ్యాపారాలను పునఃసమీక్షించుకోవాల్సి వస్తుంది. డ్రీమ్11 బీసీసీఐ స్పాన్సర్‌షిప్ రద్దు అనేది ఈ పరిణామాలలో ఒక భాగం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ పరిణామం క్రీడా రంగంలో స్పాన్సర్‌షిప్ ఒప్పందాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదమైతే డ్రీమ్11 వంటి కంపెనీల వ్యాపార నమూనాకు పెద్ద దెబ్బ తగులుతుంది. ఇది వారి ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఆర్థిక నష్టాల కారణంగా ఒప్పందాన్ని కొనసాగించడం వారికి కష్టమవుతుంది. డ్రీమ్11 డీల్‌ను రద్దు చేసుకుంటే బీసీసీఐకి స్వల్ప కాలానికి ఆర్థిక నష్టం తప్పదు. కొత్త స్పాన్సర్‌ను తక్కువ సమయంలో కనుగొనడం బీసీసీఐకి ఒక సవాలుగా మారుతుంది.