Revanth Meets Film Celebrities: తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. నిర్మాతలకు పలు సూచనలు!
సినిమా పరిశ్రమలో పని వాతావరణం మెరుగుపడాలని, కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కార్మికుల సమ్మెను ప్రస్తావిస్తూ వివాదాలు లేకుండా పని జరగాలనే ఉద్దేశంతోనే తాను చొరవ తీసుకుని సమ్మెను విరమింపజేశానని తెలిపారు.
- By Gopichand Published Date - 09:04 PM, Sun - 24 August 25

Revanth Meets Film Celebrities: తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులతో (Revanth Meets Film Celebrities) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్ చర్చించారు. సినిమా కార్మికులను కూడా పిలిచి వారి సమస్యలను వింటానని సీఎం హామీ ఇచ్చారు.
పని వాతావరణం, కార్మికుల సంక్షేమం
సినిమా పరిశ్రమలో పని వాతావరణం మెరుగుపడాలని, కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కార్మికుల సమ్మెను ప్రస్తావిస్తూ వివాదాలు లేకుండా పని జరగాలనే ఉద్దేశంతోనే తాను చొరవ తీసుకుని సమ్మెను విరమింపజేశానని తెలిపారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక సమగ్ర పాలసీని రూపొందించుకుంటే మంచిదని సూచించారు. “మా ప్రభుత్వం సినీ కార్మికులను, నిర్మాతలను కూడా కాపాడుకుంటుంది” అని ఆయన భరోసా ఇచ్చారు.
CM Revanth calls for Monitoring mechanisms for Film industry.
During meeting with film producers and directors he said –
•The work environment in the film industry must be healthy.
•I will also meet and interact with film workers directly.
•The government will extend full… pic.twitter.com/OYdDZmAB73— Naveena (@TheNaveena) August 24, 2025
నైపుణ్యాల పెంపు, స్కిల్ యూనివర్సిటీ
పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం సూచించారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన ధ్యేయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని కోరారు.
నిష్పక్షపాత వైఖరి, కొత్త పాలసీ
సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని సీఎం సూచించారు. “పరిశ్రమలోని వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే. పరిశ్రమ విషయంలో నేను నిష్పక్షపాతంగా (న్యూట్రల్) ఉంటాను” అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ యెర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేఎన్, రాధామోహన్, దాము హాజరయ్యారు. దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు.