Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్‌లు బంద్?!
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది.
- By Gopichand Published Date - 06:06 PM, Sat - 26 July 25

Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) మ్యాచ్‌లు లేదా ఇతర కార్యక్రమాలకు అనుకూలంగా లేదని, అసురక్షితమని జస్టిస్ జాన్ మైకేల్ డి కున్హా అధ్యక్షతన కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నివేదిక చిన్నస్వామి స్టేడియంలో భవిష్యత్తులో పెద్ద కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపనుంది.
కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది. స్టేడియంలో ఉన్న లోపాలను కమిషన్ కింది విధంగా హైలైట్ చేసింది.
- అత్యవసర నిష్క్రమణ (ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఏర్పాట్లు సరిగా లేవు.
- ఎంట్రీ/ఎగ్జిట్ గేట్ల సంఖ్య సరిపోవు.
- ట్రాఫిక్ సమస్య: స్టేడియం చుట్టూ రోడ్లపై భారీ ట్రాఫిక్ ఉంటుంది.
- పార్కింగ్ స్థలం: తగినంత స్థలం లేదు.
ఈ సమస్యలన్నీ చిన్నస్వామి స్టేడియం ప్రజల భద్రతకు అనుకూలంగా లేవని నివేదిక స్పష్టం చేసింది.
Also Read: Asia Cup 2025 Schedule: ఆసియా కప్ 2025.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
వరల్డ్ కప్‌పై సంక్షోభం
ఈ కమిషన్ ప్రకటన 2025 మహిళల ODI వరల్డ్ కప్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో వచ్చింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో చిన్నస్వామి మైదానంలో మొత్తం 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, శ్రీలంక మధ్య వరల్డ్ కప్ తొలి మ్యాచ్ కూడా ఇక్కడే జరగాల్సి ఉంది. నివేదిక ప్రభావంతో ఈ మ్యాచ్‌ల నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి.
మరోవైపు KSCA ఇప్పటికే మహారాజా ట్రోఫీ (రాష్ట్ర టీ20 ఫ్రాంచైజీ పోటీ)ని క్లోజ్డ్ డోర్ ఈవెంట్‌గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంటే ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో సాధారణంగా IPL, WPL మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత స్టేడియం భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.