బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి విడుదల చేసింది.
- Author : Gopichand
Date : 04-01-2026 - 8:48 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ-20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. అయితే అనూహ్య పరిణామాల మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తమ జట్టును భారత్‌కు పంపేందుకు నిరాకరిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖ రాసింది. తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరింది.
బంగ్లాదేశ్ తీసుకున్న కీలక నిర్ణయం
ఆదివారం మధ్యాహ్నం జరిగిన బీసీబీ సమావేశంలో 17 మంది డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఐసీసీకి రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు. ఒక ఆటగాడికి భద్రత కల్పించలేమని భారత్ చెప్పినప్పుడు వారు పూర్తి జట్టుకు రక్షణ ఎలా ఇవ్వగలరు? ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రతతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
Also Read: పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!
అంతేకాకుండా బీసీబీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుత పరిస్థితులను లోతుగా విశ్లేషించిన తర్వాత భారత్‌లో బంగ్లాదేశ్ బృందం భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహా మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జాతీయ జట్టు టోర్నీ కోసం భారత్ వెళ్లకూడదని బోర్డు నిర్ణయించింది” అని తెలిపింది.
ముస్తాఫిజుర్ విడుదల వివాదమే కారణమా?
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి విడుదల చేసింది. 2026 మినీ వేలంలో కేకేఆర్ ఆయనను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. అటువంటి ఆటగాడిని విడుదల చేయాలని ఆదేశించడం బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.