Australia Women T20: ఆరేసిన ఆస్ట్రేలియా.. నెరవేరని సఫారీల వరల్డ్ కప్ కల
- By Maheswara Rao Nadella Published Date - 10:10 PM, Sun - 26 February 23

మహిళల క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియా (Australia) మరోసారి నిరూపించుకుంది. రికార్డు స్థాయిలో ఆరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ ఫైనల్ కు చేరిన కంగారూలు టైటిల్ పోరులో సఫారీ టీమ్ ను నిలువరించి ప్రపంచ కప్ గెలుచుకుంది. మెగా టోర్నీ ఫైనల్లో వత్తిడిని ఎలా అధిగమించాలో చూపిస్తూ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడింది. ముఖ్యంగా బేత్ మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 74 పరుగులు చేసింది. మూనీ మినహా.. మిగతా వారు 30 కంటే తక్కువ పరుగులే చేశారు. గార్డ్‌నర్ 21 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసింది. ఆ తర్వాత టాప్ స్కోరు 18 మాత్రమే. ఆస్ట్రేలియా (Australia) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా వత్తిడికి గురైనట్టు కనిపించింది. ఓపెనర్ వాల్వర్ట్ హాఫ్ సెంచరీతో రాణించిన మిగిలిన వారు విఫలమయ్యారు. అంచనాలు పెట్టుకున్న వారెవరూ రానించలేదు. ఫలితంగా సఫారీ టీమ్ 6 వికెట్లను కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో ట్రయాన్ దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించి సౌతాఫ్రికాను కట్టడి చేశారు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడం ఇది ఆరోసారి. అలాగే వరుసగా రెండోసారి హ్యాట్రిక్ టైటిల్ ఘనత అందుకుంది.
Also Read: Scissors in Stomach: కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్లు.. ఆరేళ్లుగా మహిళకు నరకం