Scissors in Stomach: కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్లు.. ఆరేళ్లుగా మహిళకు నరకం
పెద్దపల్లి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రికి
- Author : Maheswara Rao Nadella
Date : 26-02-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
పెద్దపల్లి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఆపరేషన్ చేసి బిడ్డను తీసి కడుపులో కత్తెర (scissors) పెట్టి మర్చిపోయాడు. తరచుగా కడుపునొప్పి వస్తుందని ఎక్స్ రే తీస్తే అసలు విషయం బయటకు తెలిసింది. వివరాలు.. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది. నొప్పులు వస్తుంటే కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు వెళ్లింది. డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలనడంతో 2017 ఏప్రిల్ 15న ఆస్పత్రిలో చేరింది. మరుసటిరోజు సీనియర్ గైనకాలజిస్టు సిజేరియన్ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. సిజేరియన్ చేస్తున్న సమయంలోనే మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశాడు.. అనంతరం వారం తర్వాత ఆస్పత్రినుంచి ఇంటికి పంపేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో ఉంటున్న సదరు మహిళకు మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం అందలేదు.
కడుపునొప్పితోపాటు తరుచూ అనారోగ్య సమస్యలు తలెత్తుండడంతో.. రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి డాక్టర్ ఎక్స్‌రే తీయించుకోమని సూచించారు. ఆసమయంలోనే కత్తెర ఉందన్న విషయం ఆ మహిళకు తెలిసింది. బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్ చేసిన గైనకాలజిస్టును నిలదీశారు. రాజీ కుదుర్చురోవాలని వైద్యురాలు వేడుకున్నారు. బాధితురాలి కడుపులో కత్తెర (scissors) తీసేందుకు చేసే శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును తానే భరించడంతోపాటుగా రూ.3.50లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో అందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డబ్బులిచ్చి ఆ మహిళను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. దీనిపై వైద్యురాలిని వివరణ అడగగా..ఆపరేషన్ సమయంలో పొరబాటు జరిగి ఉండొచ్చని సమాధానం చెప్పారు.
Also Read: Shampoo Tips: మీ షాంపూలో ఆ 4 ఉండొద్దు.. గ్రీన్ టీ, కుంకుడుకాయల షాంపూలు బెస్ట్