AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
- By Latha Suma Published Date - 03:41 PM, Sat - 6 September 25

AP : రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరత, రైతులకు ఎదురవుతున్న సంక్షోభం అంశాలపై అధికార కూటమిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. “అన్నదాత పోరు” పేరుతో ఈ నెల 9న రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుతంగా నిరసనలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన సజ్జల, ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
“రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం”
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
ఉద్దేశపూర్వకంగా ఎరువుల కొరత
ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదంటూ రైతులు తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వ ప్రతినిధులు కొరత లేదని చెబుతున్నారని సజ్జల ఆరోపించారు. రైతులను లైన్‌లలో నిలబెడుతూ, అవమానించడమే కాకుండా, టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అక్రమంగా ఎరువులను నిల్వ చేసుకుని బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మకం చేస్తున్నారు. మాఫియా మాదిరి వ్యవస్థ నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు.
రైతులను బెదిరిస్తున్న పరిస్థితి
రైతులు తమ హక్కుల కోసం ప్రశ్నించగానే వారిపై కేసులు పెట్టడమే కాకుండా, బెదిరింపులకు గురిచేస్తున్నారని సజ్జల అన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన రైతులను భయపెట్టేలా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు.
చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా సజ్జల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూరియా వాడితే కేన్సర్ వస్తుందంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే ఆయన లక్ష్యం అని ఆరోపించారు.
‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయండి..సజ్జల పిలుపు
రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ చేపడుతున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని ప్రతి వైసీపీ కార్యకర్త విజయవంతం చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. ప్రజల్లో ఈ సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నిరసనలు మిన్నంటనున్న ఈ ఉద్యమం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా వైసీపీ కసిగా ముందడుగు వేస్తోంది.