Anganwadi Workers: ఏపీలో సమ్మె విరమించిన అంగన్వాడీ వర్కర్లు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం..!
జీతాల పెంపుకై అంగన్వాడీలు (Anganwadi Workers) చేస్తున్న సమ్మెతో గత కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కొత్త సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
- By Gopichand Published Date - 09:23 AM, Tue - 23 January 24

Anganwadi Workers: జీతాల పెంపుకై అంగన్వాడీలు (Anganwadi Workers) చేస్తున్న సమ్మెతో గత కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కొత్త సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీలు తెలిపారు. అయితే జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమ్మె విరమించి విధుల్లో చేరుతామని అంగన్వాడీలు ప్రకటించారు. సమ్మె కాలంలో వేతనం, నమోదైన కేసులపై సీఎం జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది.
అయితే ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్షాలు అంగన్వాడీల అంశంపై రాద్ధాంతం చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంతో అంగన్‌వాడీలు చేసిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. రేపు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం సోమవారం అంగన్వాడీలను మరోసారి చర్చలకు పిలిపించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి పలు హామీలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చాలా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించగా మిగిలినవాటిపై సానుకూలంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు.
అంగన్వాడీలు ప్రభుత్వం మందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్‌వాడీలు సమ్మెను విరమించటానికి ఒప్పుకున్నారు. డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.
అంగన్‌వాడీ టీచర్ల పదవీ విరమణ ప్రయోజనాలను 1.20 లక్షలు, హెల్పర్లకు 60 వేలకు పెంచినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇక పదవీ విరమణ విషయానికొస్తే 62 ఏళ్లు చేశారు. మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. చనిపోయిన అంగన్‌వాడీల మట్టి ఖర్చుల కోసం రూ. 20 వేలు ఇస్తామన్నారు. అంగన్‌వాడీలపై నమోదైన కేసులను ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని, సమ్మె కాలంలో జీతాలపై కూడా ముఖ్యమంత్రిదే నిర్ణయమన్నారు. సమ్మె విరమణ ప్రకటన చేసినందుకు అంగన్‌వాడీలకు ప్రభుత్వం తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.