నిమ్మకాయ నీరు ఎలా తయారు చేస్తారు?..వీటితో వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
నిమ్మకాయ నీరు కేవలం దాహం తీర్చే పానీయం మాత్రమే కాదు. ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- Author : Latha Suma
Date : 29-01-2026 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
. నిమ్మకాయ నీటిలో దాగున్న పోషక శక్తి
. బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియ వరకు లాభాలు
. నిమ్మకాయ నీరు ఎలా తయారు చేయాలి?
Lemon Water : వేసవికాలం దాదాపు వచ్చేసింది. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఈ వేడిలో దాహాన్ని తీర్చుకోవడానికి చాలామంది శీతల పానీయాలు, సోడాలు, ప్యాకెట్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాగిన వెంటనే చల్లదనం అనిపించినా వీటిలో ఉండే అధిక చక్కెరలు కృత్రిమ పదార్థాలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. బరువు పెరగడం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, జీర్ణ సమస్యలు రావడం వంటి ప్రమాదాలు ఇవి కలిగిస్తాయి. అందుకే నిపుణులు శీతల పానీయాలకు బదులుగా సహజమైన నిమ్మకాయ నీటిని రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిమ్మకాయ నీరు కేవలం దాహం తీర్చే పానీయం మాత్రమే కాదు. ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో చెమట ద్వారా కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేయడంలో నిమ్మకాయ నీరు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా వడదెబ్బకు గురైనప్పుడు ఈ నీటిని తాగితే శరీరం త్వరగా కోలుకుంటుంది. డీహైడ్రేషన్ సమస్యను నివారించడంలో ఇది సహజమైన పరిష్కారం.
రోజూ నిమ్మకాయ నీటిని అలవాటు చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. భోజనానికి ముందు ఒక గ్లాస్ నిమ్మకాయ నీరు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అవసరానికి మించి ఆహారం తీసుకోకుండా బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు మందులతో పాటు నిమ్మకాయ నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణక్రియ విషయానికి వస్తే నిమ్మకాయ నీరు ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి డయాబెటిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
విటమిన్ C వల్ల ఐరన్ శోషణ మెరుగుపడి రక్తహీనత సమస్యలు దూరమవుతాయి. నిమ్మకాయ నీరు తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాస్ గోరువెచ్చని లేదా చల్లని నీటిలో సగం నిమ్మకాయ రసం పిండాలి. రుచికి పుదీనా ఆకులు, కొద్దిగా తేనె, దోసకాయ ముక్కలు, చిటికెడు దాల్చిన చెక్క పొడి లేదా పసుపు వేసుకోవచ్చు. అయితే చక్కెర, ఉప్పును అధికంగా కలపకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి మేలు బదులు హాని జరుగుతుంది. సహజమైన నిమ్మకాయ నీటిని పరిమితంగా రోజూ తీసుకుంటే వేసవిలో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండవచ్చు.