ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?
భారత్-ఈయూ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన 27 జనవరి 2026న వెలువడనుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో జరిగే భారత్-EU శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
- Author : Gopichand
Date : 21-01-2026 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
India-EU Trade Deal: భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) త్వరలో సాకారం కాబోతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 27న ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద రెండు దేశాలు ఒకదానికొకటి తమ మార్కెట్లలో ప్రవేశాన్ని సులభతరం చేసుకుంటాయి. భారత్- ఈయూ మధ్య ఈ ఒప్పందం కుదిరితే భారతీయ వస్తువులకు ఈయూలోని 27 దేశాల మార్కెట్లలో చాలా తక్కువ టారిఫ్ (పన్ను) లేదా ఎటువంటి పన్ను లేకుండానే ప్రవేశం లభిస్తుంది. అదే విధంగా ఈయూ దేశాల వస్తువులు కూడా భారత మార్కెట్లోకి సులభంగా అందుబాటులోకి వస్తాయి.
రిపబ్లిక్ డే ముఖ్య అతిథులుగా ఈయూ ప్రతినిధులు
భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవ (2026) వేడుకలకు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు ధృవీకరించారు.
Also Read: న్యూజిలాండ్‌పై సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా!
ఈ ఒప్పందం వల్ల ఈయూకి కలిగే లాభాలు
ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్: భారత్‌తో ఇంత భారీ స్థాయిలో ఎఫ్‌టీఏ (FTA) చేసుకున్న మొదటి గ్రూపుగా ఈయూ నిలుస్తుంది, దీనివల్ల ఇతర దేశాల కంటే ముందే భారత మార్కెట్‌ను ఈయూ దేశాలు అందిపుచ్చుకుంటాయి.
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్: దీనిని ఉర్సులా వోన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ (అసాధారణ ఒప్పందం)గా అభివర్ణించారు. ఇది రెండు బిలియన్ల జనాభా ఉన్న మార్కెట్‌ను ఏకం చేస్తుంది. ఇది ప్రపంచ జీడీపీలో నాలుగో వంతుకు సమానం.
అమెరికా టారిఫ్‌లకు గట్టి సమాధానం
గణాంకాల ప్రకారం.. భారత్ ఏటా అమెరికాకు సుమారు $79.4 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై కఠినమైన టారిఫ్ నిబంధనలు విధిస్తే భారత్ తన ఎగుమతులలో సుమారు 84% ($67.2 బిలియన్లు) వాటాను యూరోపియన్ యూనియన్ మార్కెట్లకు మళ్లించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒప్పందం ఎప్పుడు?
భారత్-ఈయూ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన 27 జనవరి 2026న వెలువడనుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో జరిగే భారత్-EU శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. వీరు మన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా కూడా పాల్గొనడం ఈ ఒప్పందం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.