అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
- Author : Vamsi Chowdary Korata
Date : 29-01-2026 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk

Pilot Shambhavi Pathak
గ్వాలియర్‌లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నారు. “బుధవారం ఉదయం శాంభవి నుంచి నాకు ‘గుడ్ మార్నింగ్’ అని మెసేజ్ వచ్చింది. సాధారణంగా ఆమె అంతగా మెసేజ్‌లు చేయదు, కానీ ఆ రోజు ఎందుకో చేసింది. అదే తన నుంచి వచ్చిన ఆఖరి మాట అని ఊహించలేదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శాంభవి ఇక లేదన్న వార్త ఆమెకు చేరింది.
శాంభవి తండ్రి విక్రమ్ పాఠక్ భారత వైమానిక దళంలో రిటైర్డ్ పైలట్. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న శాంభవి, న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ శిక్షణ పూర్తి చేసింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఢిల్లీ, లండన్, రష్యా వంటి అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడిపి తన ప్రతిభను చాటుకుంది. చిన్నతనంలో గ్వాలియర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్కూల్లో చదివిన ఆమె, ఎప్పుడు నగరానికి వచ్చినా తన అమ్మమ్మను కలవకుండా వెళ్లేది కాదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు కెప్టెన్ సుమిత్ కపూర్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్‌లు ఈ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. శాంభవి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఆమె తండ్రి పూణె చేరుకున్నారు. ఒక తెలివైన, చురుకైన యువ పైలట్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం గ్వాలియర్‌లోని ఆమె పొరుగువారిని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.